ఇది ఈ టెర్ములో లాస్ట్ తెలంగాణ‌ సెల‌బ్రేష‌న్ !

ఇది ఈ టెర్ములో లాస్ట్ తెలంగాణ‌ సెల‌బ్రేష‌న్ !

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌య్యారా?  రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఇటు యువ‌త‌ను, అటు కీల‌క సామాజిక‌వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రిచే ఎత్తుగ‌డ‌ను వేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇది ఈ టెర్ములో ఇదే చివ‌రి ఆవిర్భావ దినోత్స‌వం. వచ్చే ఆవిర్భావ దినోత్స‌వం మ‌ళ్లీ సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత వ‌స్తుంది. మ‌రి అప్ప‌టికి మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి ఈ జూన్ 2నే గొప్ప వేదిక చేసుకోవ‌డానికి కేసీఆర్ నిర్ణ‌యించారు.

 ఇప్ప‌టికే ప్రారంభించిన ప‌థ‌కాల‌పై కీల‌క నిర్ణ‌యాలు వెలువ‌రించ‌డం, మ‌రిన్ని కొత్త పథ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డం అనే ఎత్తుగ‌డ‌తో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ ప్ర‌సంగం ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే ఒకేరోజు 18వేల పోలీస్ కానిస్టేబుల్ కొలువుల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం యువ‌త‌కు మ‌రిన్ని తీపిక‌బుర్లు అందించేందుకు దాదాపు 3వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది.   

ఓటు బ్యాంకులో కీల‌క‌మైన అగ్ర‌వ‌ర్ణాల‌ను ఆక‌ట్టుకునే నిర్ణ‌యం రేపు కేసీఆర్ వెల్ల‌డించ‌నున్న‌ట్లు స‌మాచారం. అగ్రవర్ణాల్లో పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది విదేశాలకు వెళ్ళే బ్రాహ్మణ విద్యార్థులకు వ‌డ్డీ లేకుండా రుణాన్ని అందిస్తోంది. అదే రీతిలో నూత‌న కార్పొరేషన్‌ ఏర్పాటు కానుంద‌ని స‌మాచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ తరహాలోనే ఈ కార్పొరేషన్‌ ఏర్పాటవుతుందని, కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. కేసీఆర్  ప్రారంభించిన కేసీఆర్‌ కిట్స్‌ పథకం ప్రశంసలు అందుకుంటున్న‌ప్ప‌టికీ ఈ కిట్స్‌వల్ల తమపై పనిభారం పెరిగిందని వైద్యులు, కిందిస్థాయి సి బ్బంది ఆందోళన వ్యక్తంచేస్తుండడంతో వీరికి కొ న్ని తాయిలాలు ప్రకటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

దీంతోపాటుగా కీల‌క‌మైన ఉద్యోగుల విష‌యంలో తీపిక‌బురు అందించే ప్ర‌క‌ట‌న కేసీఆర్ చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇప్పటికే కరవు భత్యాన్ని ప్రకటించిన కేసీఆర్‌ శనివారం మధ్యంతర భృతిని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆర్థికశాఖ మ ధ్యంతర భృతి ప్రకటనపై ఇప్పటికే గణాంకాలు సిద్ధంచేసి కేసీఆర్‌కు ఇవ్వగా ఆయన ఈ అంశంపై అ ధికారులతో చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అధికారులు 15 శాతం మధ్యంతర భృతి ప్రకటించవచ్చని సూచించగా ఈ మొత్తాన్ని ఆయన మరో ఐదుశాతం పెంచి 20 శాతం లేదా 25 శాతం భృతిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని రైతాంగానికంతా రూ.5 లక్షల జీవిత బీమా వర్తింపజేసేందుకు కేసీఆర్‌ ఇప్పటికే భారత జీవిత బీమా సంస్థతో చర్చలు జరిపి నిర్ణయం ప్రకటించారు. ఆవిర్భావ దినోత్స‌వ ప్ర‌సంగంలో ఈ అంశానికి సంబంధించిన మ‌రిన్ని అంశాల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. స్థూలంగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా చేయ‌బోయే ఆవిర్భావ ప్ర‌సంగం కీల‌కంగా ఉండేలా కేసీఆర్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు