మోడీ అంటే జ‌నాల‌కు ఎంత మంటో మ‌ళ్లీ రుజువైంది

మోడీ అంటే జ‌నాల‌కు ఎంత మంటో మ‌ళ్లీ రుజువైంది

ఒక‌ప్పుడు బీజేపీకి ఎవ‌రైతే వ‌రం అయ్యారో.. ఇప్పుడు అదే వ్య‌క్తి శాపంగా మార‌టం చూస్తే కాల వైచిత్రి అనుకోకుండా ఉండ‌లేం. అంతులేని విధంగా పెరిగిన అహంభావం.. ఎవ‌రిని లెక్క చేయ‌నిత‌నం.. అధికారంలో ఉన్న‌ప్పుడు ఏమైతే ఉండ‌కూడ‌దో అలాంటి లక్ష‌ణాల‌న్నీ ప్ర‌ద‌ర్శించే మోడీషాల‌కు తాజా ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రోసారి దిమ్మ తిరిగేపోయేలా చేస్తున్నాయి. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి.

దేశ వ్యాప్తంగా బీజేపీ ఎదురుగాలి ఎంత ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యం తాజాగా వెలువ‌డుతున్న ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నాలుగు ఎంపీ స్థానాల‌కు.. 11 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన ఫ‌లితాల ప్ర‌కారం.. ఈ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌లైన కౌంటింగ్ ఇప్ప‌టికి కొన‌సాగుతోంది. ఎన్నిక‌లు జ‌రిగిన చోట్ల విప‌క్షాలు త‌మ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించ‌గా.. బీజేపీకి ఎక్క‌డా అనుకూల ఫ‌లితం వ‌స్తున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు.

దేశం మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కైరానా లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్ ఎల్డీ అభ్య‌ర్థి అధిక్యంతో దూసుకెళుతున్నారు. బీజేపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ సీటులో విప‌క్ష పార్టీ అధిక్య‌త‌తో దూసుకెళ్ల‌టం క‌మ‌ల‌నాథుల‌కు క‌రెంట్ షాక్ మాదిరి మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
మ‌హారాష్ట్రలో జ‌రిగిన ఉప ఎన్నిక‌లు మిన‌హా మిగిలిన చోట్ల బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న‌ట్లుగా చెప్పాలి. నాగాలాండ్ సొలె లోక్ స‌భ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితంలో ఎన్డీపీపీ అభ్య‌ర్థి ముందంజ‌లో ఉన్నారు. కైరానా లో విప‌క్ష పార్టీల‌న్నీ క‌లిపి త‌బ‌స్సుమ్ హ‌స‌న్ (ఆర్ ఎల్డీ) ను అభ్య‌ర్థిగా నిలిపాయి. ఆమె బీజేపీ అభ్య‌ర్థి కంటే అధిక్యంలో దూసుకెళుతున్నారు.

ఇదిలా ఉంటే.. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఎక్కువ స్థానాల్లో బీజేపీయేత‌ర పార్టీలు గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. కాంగ్రెస్ భారీగా లాభాన్ని పొందుతున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తం 11 స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో అధిక్య‌త‌లో నిల‌వ‌గా.. బీజేపీ ఒక్క స్థానంలో అధిక్య‌త‌లో ఉంది. మిగిలిన స్థానాల్లో ఇత‌ర పార్టీలు అధిక్యం దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఒక పార్ల‌మెంటు.. ఒక అసెంబ్లీ స్థానానికి  జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్ని బీజేపీ ప్ర‌త్య‌ర్థులు కైవ‌శం చేసుకున్నారు. లోక్ స‌భ స్థానంలో విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి అధిక్య‌త‌లో నిల‌వ‌గా.. అసెంబ్లీ స్థానంలో (నూర్ పూర్) స‌మాజ్ వాదీ సొంతం చేసుకుంది. వాస్త‌వానికి ఈ సీటు బీజేపీది. తాజా ఫ‌లితాలు చూసిన‌ప్పుడు మోడీకి ఎదురుగాలి వీస్తున్న వైనం స్ప‌ష్టంగా క‌నిపించ‌క మాన‌దు. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన చేదు అనుభ‌వాన్ని మ‌ర్చిపోక ముందే.. తాజాగా వెలువ‌డిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు మోడీషా ప‌రివారానికి షాకింగ్ గా మార‌తాయ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు