ఎలక్ష‌న్ క‌మిష‌న్ ఓ ఉంపుడు గ‌త్తె - ఉద్ద‌వ్ ఠాక్రే

ఎలక్ష‌న్ క‌మిష‌న్ ఓ ఉంపుడు గ‌త్తె  - ఉద్ద‌వ్ ఠాక్రే

గ‌డిచిన ప‌దేళ్ల‌లో రాజకీయాల్లో చాలానే మార్పులు వ‌చ్చాయి.  సంప్ర‌దాయంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. విలువ‌ల‌కు పెద్ద పీట వేయ‌టం.. తొంద‌ర‌ప‌డి మాట తూల‌టం లాంటివి ప‌దేళ్ల కింద‌ట చేసే వారు కాదు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. ఎవ‌రినైనా స‌రే.. ఎంత మాట అయినా అనేసే ప‌రిస్థితి. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ‌ల‌పై ఆరోప‌ణ‌లు చేసేట‌ప్పుడు.. తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తే వేళ‌.. కొంచమైనా వెనుకా ముందు చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

కానీ.. అవేమీ ప‌ట్టించుకోకుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం ఇటీవ‌ల కాలంలో ఎక్కువైంది. దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా శివ‌సేన అధినేత తాజా వ్యాఖ్య‌ల్ని చెప్పాలి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీద ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు షాకింగ్ గా ఉండ‌ట‌మే కాదు.. ఈ స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌ట‌మా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌వు.

అధికారంలో ఉన్న వారికి అడుగుల‌కు ఈసీ మ‌డుగులొత్తుతోందంటూ తీవ్రంగా విరుచుకుప‌డ‌టం ఒక ఎత్తు అయితే.. ఆ మాట‌ల్ని త‌న‌దైన శైలిలో చెప్పిన శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే మాట‌లు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. ఒక రాజ్యాంగ సంస్థ‌పైనా ఇంత దిగ‌జారి మాట్లాడ‌తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.  ఇంత‌కీ ఉద్ద‌వ్ ఠాక్రే చేసిన వ్యాఖ్య ఏమిటంటే.. ఎన్నిక‌ల సంఘం ఒక సెక్స్ వ‌ర్కర్ లా ప‌ని చేస్తోంది. ఈవీఎంలు బ్రోత‌ల్ వంటివి. ప్ర‌జాస్వామ్యం.. ఎన్నిక‌లు బీజేపీకి దొర‌సానిలా మారిపోయాయి. ఎన్నిక‌ల సంఘం.. దాని యంత్రాంగం అధికారంలో ఉన్న వారికి ఊడిగం చేస్తున్నాయి అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.
ఉన్న‌ట్లుండి రాక్రే ఫైరింగ్ ఈసీ మీద‌కు ఎందుకు మ‌ళ్లింద‌న్న‌ది చూస్తే.. తాజాగా దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో భాగంగా మ‌హారాష్ట్రలోనూ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి.  పోలింగ్ సంద‌ర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు.. వీవీ ప్యాట్ యంత్రాల్లో లోపాలు త‌లెత్తిన‌ట్లుగా ఫిర్యాదు న‌మోద‌య్యాయి. దీంతో త‌మ అధికార ప‌త్రిక అయిన సామ్నాలో సంపాద‌కీయం ప్ర‌చురించారు. అందులో ఈసీ మీద తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌ల దాడి చేశారు.

ఈవీఎంలను బీజేపీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంద‌ని.. ఈసీ.. దాని యంత్రాలు ప్ర‌భుత్వానికి బానిస‌లా మారిన‌ట్లుగా మండిప‌డ్డారు. కొన్నేళ్లుగా బీహెచ్ఈఎల్ రూపొందించిన ఈవీఎంల‌ను ఈసీ వాడ‌గా.. ఈసారి మాత్రం సూర‌త్ లోని  ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఈవీఎంలు తెప్పించ‌టంపై శివ‌సేన సందేహాలు వ్య‌క్తం చేశారు.

ప‌దునైన విమ‌ర్శ‌లు త‌ప్పు కాకున్నా.. అందులో భాగంగా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట‌ల్ని ఉపయోగించ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. దీనిపై ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు