సంచ‌ల‌నంగా ప్ర‌ణ‌బ్ దా సెకండ్ ఇన్నింగ్స్ క‌థ‌నాలు

సంచ‌ల‌నంగా ప్ర‌ణ‌బ్ దా సెకండ్ ఇన్నింగ్స్ క‌థ‌నాలు

ఈ రోజు ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌ల్ని చూశారా?  వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా.. అన్ని మీడియా సంస్థ‌లు ఒక ఆస‌క్తిక‌ర వార్త‌ను ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి. ఇంత‌కీ ఆ వార్తేమిటంటే.. రాష్ట్రప‌తిగా సేవ‌లు అందించిన మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ.. తాజాగా మ‌రో కీల‌క‌మైన ఇన్నింగ్స్ కు తెర తీశార‌ని.

మోడీ పాల‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టం.. రాహుల్ ప్ర‌ధానిగా ప‌లు ప్రాంతీయ‌పార్టీలు అంగీక‌రించేందుకు సిద్ధంగా లేని వేళ‌.. మూడో  ఫ్రంట్ ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. మ‌రి.. ఈ కూట‌మి కానీ యాక్టివ్ అయితే.. ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న అంశంపై ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. తెర వెనుక జోరుగా సాగుతున్న వ‌ర్క్ కు సంబంధించిన వివ‌రాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారాయి.

రాజ‌కీయాల్లో కురువృద్ధుడు.. వ్యూహాలు రూపొందించ‌టంలో దిట్ట అయిన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌టం ద్వారా దేశ రాజ‌కీయాల్లో స‌రికొత్త సంచ‌ల‌నానికి తెర తీస్తున్నారా? అంటే.. అవున‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీయేత‌ర‌.. కాంగ్రెస్సేయేత‌ర ప‌క్షాల‌కు ధీటుగా నిలుస్తుంద‌ని భావిస్తున్న ఫ్రంట్‌కు ప్ర‌ణ‌బ్ దా నేతృత్వం వ‌హిస్తార‌ని.. ఆయ‌న్ను త‌మ కూట‌మి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపుతామ‌ని చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇందుకు ప్ర‌ణ‌బ్ దా సైతం గ్రీన్ సిగ్న‌ల్స్ ఇచ్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే బ్యాక్ గ్రౌండ్ వ‌ర్క్ భారీ ఎత్తున జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. ఎవ‌రికి అనుమానం రాని రీతిలో ఇప్ప‌టికే ఈ అంశానికి సంబంధించి ఒడిశా ముఖ్య‌మంత్రి.. ప‌శ్చిమ‌బెంగాల్ సీఎంతో స‌హా పలువురు ముఖ్య‌నేత‌లు ప్ర‌ణ‌బ్ తో భేటీ అయిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌తంలో జ‌రిగిన అంశాల్ని చూస్తే.. ప్ర‌ణ‌బ్ దాను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా డిసైడ్ చేయ‌టానికి ప‌లువురు ముఖ్య‌మంత్రులు ఇప్ప‌టికే త‌మ అంగీకారాన్ని చెప్పేసిన‌ట్లుగా తెలుస్తోంది.

మ‌రికొద్ది కాలంగా తెర వెనుక గుట్టుగా సాగుతున్న ఈ అంశాలు ఇప్పుడే బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చిన‌ట్లు? అంటే.. దీనికి కార‌ణం లేక‌పోలేదు. తాజాగా బీజేపీకి దిశా నిర్దేశం చేస్తారని చెప్పే సంఘ్ ప‌రివార్ నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి ప్ర‌ణ‌బ్ దాను ఆహ్వానించ‌టం.. అందుకు ఆయ‌న ఓకే అన‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

సంఘ్ పిలిచిన వెంట‌నే మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ఓకే అన‌టం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. హిందుత్వ సంస్థ అన్న పేరుతో పాటు.. ప‌లు విమ‌ర్శ‌ల్ని మూట‌క‌ట్టుకున్న సంస్థ‌కు సంబంధించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ణ‌బ్ పాల్గొన‌టానికి వెనుక కార‌ణం అంద‌రిని కూడ‌గ‌ట్టుకోవాల‌నే ఉద్దేశ‌మే ప్ర‌ధాన‌మ‌ని చెబుతున్నారు. ప్ర‌ధాని ప‌ద‌విని చేపట్టాల‌న్న కోరిక‌ను ప్ర‌ణ‌బ్ ఎప్పుడూ దాచుకోలేదు.

మ‌న్మోహ‌న్ హ‌యాంలోనూ ప్ర‌ణ‌బ్ ను ప్ర‌ధాని కాని ప్ర‌ధానిగా పేరుంది. ఒక‌ద‌శ‌లో మ‌న్మోహ‌న్ కు సోనియాకు దూరం పెరిగింద‌న్న వాద‌న బ‌లంగా వినిపించింది. ఈ సంద‌ర్భంలో ప్ర‌ణ‌బ్ ను ప్ర‌ధానిగా చేసే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ జోరుగా సాగింది. నిజానికి ప్ర‌ణ‌బ్ కు ప్ర‌ధాని కావాల‌న్న  ఆశ‌ను తీర్చ‌లేని క్ర‌మంలో ఆయ‌న్ను దేశంలోనే అత్యున్న‌త ప‌ద‌వి అయిన రాష్ట్రప‌తి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన‌ట్లుగా చెబుతారు. రాష్ట్రప‌తిగా త‌న ఇన్నింగ్స్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ప్ర‌ణ‌బ్‌.. రానున్న రోజుల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే.. దేశ రాజ‌కీయాల్లో స‌రికొత్త రాజ‌కీయం తెర లేచిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు