హైద‌రాబాద్ "ఐటీ" కంపెనీల‌కు నెట్ క‌ట్‌!

హైద‌రాబాద్

అధికారులు తీసుకున్న నిర్ణ‌యం ప‌లు ఐటీ కంపెనీల‌కు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చాయి. ఒకర‌కంగా చూస్తే.. జీహెచ్ ఎంసీ అధికారుల నిర్ణ‌యం స‌రైన‌దే అయిన‌ప్ప‌టికీ.. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణ‌యం తీసుకొని ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యుత్ స్తంభాల‌కు ఇంట‌ర్నెట్ కేబుల్స్ ఉండ‌టంపై జీహెచ్ ఎంసీ అధికారులు కొర‌డా ఝుళిపించారు.
అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ఉన్న నెట్ కేబుళ్ల‌ను అప్ప‌టిక‌ప్పుడు తొల‌గించ‌టంతో హైద‌రాబాద్ ఐటీకి కీల‌క‌మైన గ‌చ్చిబౌలి డీఎల్ ఎఫ్ ఐటీ కారిడార్ ఐటీ సేవ‌లు నిలిచిపోయాయి. దీంతో.. ప‌లు ఐటీ కంపెనీలు విల‌విల‌లాడాయి. ఐటీ కంపెనీల‌కు ఊపిరిలాంటి ఇంట‌ర్నెట్ లేక‌పోవ‌టంతో వారి కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి.

ఇంత‌కూ ఇంత‌టి నిర్ణ‌యాన్ని జీహెచ్ ఎంసీ అధికారులు తీసుకోవ‌టానికి కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. జ‌య‌భేరి ఎన్ క్లేవ్ లోని ఖాళీ స్థ‌లంలో పెట్ పార్కును నిర్మిస్తున్నారు. ఈ పార్కు ముందున్న క‌రెంటు స్తంభాల‌కు ఇంట‌ర్నెట్ వైర్లు ఉన్నాయి. అధికారుల త‌నిఖీల్లో భాగంగా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న ఇంట‌ర్నెట్‌కేబుల్స్ ను తొల‌గించాల‌న్న నిర్ణ‌యం తీసుకోవ‌టంతో.. అప్ప‌టిక‌ప్పుడు విద్యుత్ స్తంభాల్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేసిన కేబుల్ వైర్ల‌ను తొల‌గించారు.

ఎలాంటి నోటీసులు లేకుండా.. ఉన్న‌ట్లుండి అధికారులు తీసుకున్న నిర్ణ‌యంతో.. గ‌చ్చిబౌలి ప్రాంతానికి చెందిన ప‌లు ఐటీ కంపెనీలు ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిచిపోవ‌టం ఆగ‌మాగ‌మ‌య్యారు. ముందుగా నోటీసు ఇచ్చి.. అప్ప‌టికి తీరు మార‌కుంటే చ‌ర్య‌లు తీసుకోవాల్సింద‌ని.. అందుకు భిన్నంగా ఆక‌స్మిక నిర్ణ‌యాల‌తో ఐటీ కంపెనీల‌కు భారీ షాక్ త‌గిలింద‌ని చెబుతున్నారు. ఈ ఉదంతంలో నెట్ సేవ‌లు అందుకునే ఐటీ కంపెనీల త‌ప్పు కంటే.. నెట్ సేవ‌ల్ని అందించే సంస్థ‌ల త‌ప్పిద‌మే ఎక్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ప్పు చేసింది ఒక‌రైతే.. దానికి సంబంధించిన ఫ‌లితం ఐటీ కంపెనీలు అనుభ‌వించాల్సి వ‌చ్చిందంటూ ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English