జ‌గ‌న్‌ది వాళ్ల తాత బుద్ధి

జ‌గ‌న్‌ది వాళ్ల తాత బుద్ధి

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. అనుకున్న విష‌యాన్ని ముక్కుసూటిగా కుండ‌బ‌ద్ద‌లుకొట్టిన‌ట్లుగా చెప్పడం జేసీ నైజం. త‌న మ‌న భేదం లేకుండా నిర్మొహ‌మాటంగా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం జేసీ మేన‌రిజం. నిత్యం త‌న విల‌క్ష‌ణ‌మైన వ్యాఖ్య‌ల‌తో జేసీ వార్త‌ల్లో నిలుస్తుంటారు. తాజాగా, వైసీపీ అధినేత జగన్ పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కు ఆయ‌న తాత రాజారెడ్డి లక్షణాలు వచ్చాయని జేసీ అన్నారు. జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌ర‌ని, అందువ‌ల్ల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతోబాధ‌ప‌డేవార‌ని అన్నారు.

విజ‌య‌సాయిరెడ్డిపై కూడా జేసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను వైసీపీలో చేరాల్సిందిగా విజ‌యసాయిరెడ్డితో జగన్‌ రాయబారం పంపాడ‌ని చెప్పారు. కోరిన‌న్ని సీట్లు ఇస్తామ‌ని విజయసాయిరెడ్డి త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చార‌ని , జగన్‌ సంగతి త‌న‌కు తెలుసు కాబ‌ట్టి దానిని తిరస్కరించాన‌ని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపిత‌మైంద‌ని జేసీ అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా జేసీ అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నానంత‌రం ఏపీలో ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను స‌మాధి చేశార‌ని అన్నారు. ఏపీకి చంద్రబాబు స‌రైన నాయ‌కుడ‌ని, ఆయ‌న‌కున్నంత‌ దూరదృష్టి మరెవరికీ లేద‌ని ప్ర‌శంసించారు. టీడీపీ చంద్రబాబు ఆస్తి అని, దాని వారసుడు కచ్చితంగా లోకేషేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రెవ‌రో ఏవేవో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని...అయినా , చంద్రబాబు త‌ద‌నంత‌రం లోకేష్ సీఎం అయితే  తప్పేంటి? అని జేసీ ప్ర‌శ్నించారు. 2 ఎక‌రాలతో చంద్ర‌బాబు లక్షల కోట్లు సంపాదించారని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారని, పెట్రోల్ బంకులో పనిచేసిన ధీరూబాయి అంబానీ.... లక్షల కోట్లు కూడ‌బెట్టార‌ని గుర్తుచేశారు.

అయినా, ఆస్తులు సంపాదించుకుంటే తప్పేంట‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు సేవలు దేశానికి అవసరమ‌ని, భార‌త దేశం బాగుపడాలంటే చంద్రబాబు ప్రధానమంత్రి కావాల‌ని ఆకాంక్షించారు. మోదీ ప్రధానిగా ఉన్నంత‌కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాద‌న్నారు. చంద్రబాబు దయవ‌ల్లే ఏపీలో బీజేపీకి ఆ సీట్ల‌యినా ద‌క్కాయ‌న్నారు. కియా ప్రతినిధులకు మోదీ 5 సార్లు ఫోన్‌ చేసి గుజరాత్ లో ప్లాంట్‌ పెట్టాలని ఒత్తిడి చేశార‌ని, చంద్ర‌బాబు వ‌ల్లే ఆ ప్లాంట్ అనంత‌పురానికి ద‌క్కింద‌ని అన్నారు. క‌రువు కాట‌కాల‌తో కొట్టుమిట్టాడే అనంతపురం జిల్లాను చంద్రబాబు కోన‌సీమ‌ను త‌ల‌పించేలా సస్యశ్యామలం చేస్తున్నార‌ని కితాబిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు