నన్ను హైజాక్ చేశారంటున్న హైదారి

నన్ను హైజాక్ చేశారంటున్న హైదారి

మణిరత్నం సినిమాలో హీరోయిన్ గా అవకాశం దొరకడమంటే హీరోయిన్లు ఓ లక్ గా భావిస్తారు. ఆ లక్ ను రెండుసార్లు దొరకబుచ్చుకున్న భామ అదితిరావ్ హైదారి. ఈ బాలీవుడ్ బ్యూటీ బేసిగ్గా హైదరాబాదీనే అయినా బాలీవుడ్ లో కెరీర్ లో మొదటి అడుగులు వేసింది. కార్తి హీరోగా మణిరత్నం తీసిన చెలియా సినిమాతో తొలిసారి సౌత్ లో అడుగు పెట్టింది. ఇప్పుడు వరసగా పెద్ద ప్రాజెక్టులే చేస్తోంది. టాలీవుడ్.. కోలీవుడ్ తనను హైజాక్ చేసేశాయని ఆనందంగా చెబతోంది భామ.

చెలియా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. కానీ అదితి నటనకు మాత్రం గుర్తింపు వచ్చింది. దాంతో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఆమెను సమ్మోహనం సినిమాకు ఏరికోరి హీరోయిన్ గా ఎంచుకున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ మూవీ చేస్తుండగానే అదితికి టాలీవుడ్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్టుకు ఆఫర్ వచ్చింది. ఘాజీ సినిమాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి స్పేస్ బ్యాక్ గ్రౌండ్ గా తరవాత సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో అదితి ఓ హీరోయిన్.

దీంతోపాటు మణిరత్నం తరవాత తమిళంలో తీస్తున్న మల్టీస్టారర్ మూవీ చెక్క చివాంత వనంలో (తెలుగులో నవాబ్) అదితి రావ్ హైదరీయే హీరోయిన్ గా ఎంపికైంది. ఇలా టాలీవుడ్.. కోలీవుడ్ లో అన్నీ క్రేజీ ప్రాజెక్టులు తనను వెతుక్కుంటూ రావడంతో అదితి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ రెండు ఇండస్ట్రీలు తనను హైజాక్ చేసేశాయని అంటోంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు