నాగ్ సార్.. సౌండ్ గురించి మాట్లాడితే సరిపోదు

నాగ్ సార్.. సౌండ్ గురించి మాట్లాడితే సరిపోదు

అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అనగానే అందరికీ ‘శివ’నే గుర్తుకొస్తుంది. వీళ్ల కాంబినేషన్లో ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు సరిగా ఆడలేదు. వాటి గురించి ఎవరూ మాట్లాడరు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ‘ఆఫీసర్’ సినిమా చేశారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా దీని గురించి కంటే వీళ్లిద్దరూ ఎప్పుడో మూడు దశాబ్దాల కిందట చేసిన ‘శివ’ గురించే అందరూ మాట్లాడారు.

‘ఆఫీసర్’ రెండు టీజర్లు, ఇతర ప్రోమోలు ఎంత నిరాసక్తంగా కనిపించాయో తెలిసిందే. ఇక్కడ వర్మ నైపుణ్యం గురించి మాట్లాడటానికి పెద్దగా అవకాశం లేకపోయింది. దీంతో అందరూ ‘శివ’తో మొదలుపెట్టి ప్రసంగాలు చేశారు. నాగ్ కూడా అప్పటి రోజుల్నే గుర్తుకు తెచ్చుకున్నాడు.

‘శివ’ ఎంత క్లాసిక్ అయినా కావచ్చు. కానీ అదొచ్చి మూడు దశాబ్దాలవుతోంది. ఎంతసేపూ దాని గురించే మాట్లాడి నాగ్-వర్మ కాంబో గురించి గొప్పలు పోతే ఎలా? ‘ఆఫీసర్’ సంగతేంటో తేల్చాలి కదా? నాగ్ ఈ సినిమా ప్రస్తావన తెచ్చినపుడు కూడా కంటెంట్ గురించి కాన్ఫిడెంటుగా ఏమీ మాట్లాడలేదు. ‘శివ’ తర్వాత ‘ఆఫీసర్’ సౌండు గురించి అందరూ మాట్లాడుకుంటారని అన్నాడు.

అయినా టెక్నికల్‌గా వర్మ ఎప్పుడూ బలంగానే ఉంటాడు. టేకింగ్ విషయంలో ఉన్నత ప్రమాణాలు చూపిస్తాడు. సాంకేతిక నిపుణుల నుంచి అద్భుతమైన పనితనం రాబట్టుకుంటాడు. ఎటొచ్చీ కంటెంట్ దగ్గరికి వచ్చేసరికే తీవ్రంగా నిరాశ పరుస్తాడు. దశాబ్దం నుంచి ఇదే వరస. మరి ‘ఆఫీసర్’లో అయినా విషయంలో ఉంటుందా అని సందేహాలు కొనసాగుతున్నాయి. నాగ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో సౌండ్ సౌండ్ అనేసరికి ఆ సందేహాలు మరింత బలపడ్డాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు