నాడు జ‌గ‌న్ అరెస్టుపై లక్ష్మీనారాయ‌ణ క్లారిటీ!

నాడు జ‌గ‌న్ అరెస్టుపై లక్ష్మీనారాయ‌ణ క్లారిటీ!

వైసీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఈడీ దాఖ‌లు చేసిన కేసును అప్ప‌టి సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీనారాయ‌ణ విచార‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈడీకేసులో జ‌గ‌న్ ను అరెస్టు చేయ‌డం....దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఆ కేసులో లక్ష్మీనారాయ‌ణ వ్య‌వ‌హ‌రించిన తీరుపై గ‌తంలో కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిళ్లు, మాజీ సీబీఐ, పోలీసు ఉన్న‌తాధికారుల ఒత్తిళ్ల ప్ర‌కార‌మే జ‌గ‌న్ ను అరెస్టు చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ల‌క్ష్మీనారాయ‌ణ ఆ ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే జ‌గ‌న్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజ‌రుప‌రిచామ‌ని, త‌న‌పై ఎటువంటి రాజ‌కీయ ఒత్తిడులు లేద‌ని లక్ష్మీనారాయ‌ణ స్పష్టం చేశారు. ఆ మాట‌కొస్తే తాను జ‌గ‌న్ కేసు విచార‌ణ‌కు రాక ముందే సీబీఐ విభాగంలో డీజీపీగా విధులు నిర్వ‌హిస్తున్నాన‌ని చెప్పారు. ఆ ఇంట‌ర్వ్యూలో లక్ష్మీనారాయ‌ణ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

త‌న‌పై వ‌చ్చిన పుకార్ల‌పై ల‌క్ష్మీనారాయ‌ణ క్లారిటీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం పై అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే నాడు జగన్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్టు చేసిన 24 గంటల లోపే ఆయ‌న‌ను కోర్టులో హాజరుపరిచామన్నారు. ఒక్క జ‌గ‌న్ విష‌యంలోనే కాద‌ని ...ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల్లో అరెస్ట‌యిన వారిని 24 గంట‌ల‌లోపు కోర్టులో హాజ‌రుప‌రుస్తామ‌ని, అది త‌మ విధినిర్వ‌హణలో భాగ‌మ‌ని ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. జ‌గన్ విష‌యంలో కూడా....కోర్టు తాము దాఖ‌లు చేసిన వివ‌రాలు, సాక్ష్యాధారాల‌ను ప‌రిశీలించి సరైనవేనని నిర్ధారించిందని ఆయ‌న తెలిపారు. జ‌గ‌న్ కేసు కోసమే త‌న‌ను ప్ర‌త్యేకంగా నియ‌మించార‌న్న వ‌దంతుల్లో వాస్త‌వం లేద‌న్నారు.

2006లోనే తాను హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకి డీజీపీగా బదిలీపై వచ్చానని, 2011లో జ‌గ‌న్ కేసు తన ద‌గ్గ‌ర‌కు వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, జ‌గ‌న్ ను అరెస్టు చేయాలని తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులూ రాలేదన్నారు. నాటి సీబీఐ పెద్ద‌ల‌ నుంచి తనపై ఒత్తిడి వచ్చిందన్న వార్త‌లు అసత్యమని చెప్పారు. త‌మ‌కు ల‌భించిన సాక్ష్యా ధారాలను బ‌ట్టే విచారణ జరిపామని, నిబంధనలకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు