రాహుల్ కౌంటర్.. బీజేపీ ఎన్‌కౌంటర్!

రాహుల్ కౌంటర్.. బీజేపీ ఎన్‌కౌంటర్!

ట్విట్టర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ సోషల్ మీడియా వింగ్ మధ్య కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు నడుస్తున్నాయి.గతంలో ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయని రాహుల్.. ఈసారి చెప్పి మరీ.. గిల్లీ వెళ్లటం విశేషం. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

కామెడీ సెటైర్లతో హడావుడి అవుతోంది.తల్లి సోనియాగాంధీతో కలిసి రాహుల్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే కదా. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియా మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నానని చెబుతూనే బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. `` నా మిత్రులైన బీజేపీ సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీకి ఒకటి చెప్పదలచుకున్నాను. మీరు మరీ ఎక్కువగా కష్టపడొద్దు.. నేను అతి త్వరలోనే వచ్చేస్తాను`` అంటూ సెటైర్ వేశారు.

రాహుల్ కౌంట‌ర్‌కు బీజేపీ సైతం అదే రీతిలో స్పందించింది. బీజేపీ కొంచెం సమయం తీసుకున్న‌ప్ప‌టికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ``సోనియాగాంధీ వెంటనే కోలుకోవాలని ఆశిస్తున్నాం.. కర్నాటకలో ఇంకా మంత్రివర్గం కొలువుదీరలేదు. పొత్తులు ఖరారు కాలేదు. ప్రజలు కూడా ప్రజాపాలన కోసం ఎదురుచూస్తున్నారు. మీరు వెళ్లేలోపు పని చేసే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది`` అంటూ కర్నాటక ర‌చ్చ‌ను కెలికింది. `సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరూ కూడా.. మీరు అక్కడి నుంచే మమ్మల్ని ఎంటర్ టైన్ మెంట్ చేస్తారని ఆశిస్తున్నారు`` అంటూ ఇండైరెక్ట్ గా రాహుల్ లోని లోపాలను ఎత్తిచూపుతూ ట్రోల్ మొదలుపెట్టేసింది.

ఇదిలాఉండ‌గా...సోనియాతో వెళ్తున్న రాహుల్ వారం తర్వాత తిరిగి ఇండియా వచ్చేయనుండగా.. ఆమె మాత్రం మరికొంతకాలం విదేశాల్లోనే ఉండనున్నారు. అంతవరకు కర్ణాటకలో కేబినెట్ ఏర్పాటుతోపాటు ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనినే బీజేపీ ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటై ఇన్నాళ్లయినా కేబినెట్ ఏర్పాటు కాకపోవడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. రాహుల్ వెళ్లే ముందు కేబినెట్‌పై సీనియర్ నేతలతో చర్చించినా.. అది అసంపూర్తిగా మిగిలిపోయింది.

అయితే రాహుల్ ఎప్పుడూ ఫోన్లో అందుబాటులో ఉంటారని, ఆయన వచ్చే వరకు నిర్ణయాన్ని వాయిదా వేయబోమని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వివ‌రించారు. మ‌రోవైపు రాహుల్ గాంధీ విదేశాలకు వెళతూ బీజేపీకి ఇచ్చిన పంచ్.. ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద చర్చకు దారితీసింది. బీజేపీని రాహుల్‌ గిల్లి మరీ వెళ్లాడు... రాహుల్ బాగా డెవలప్ అయ్యాడు అంటూ కొందరు అంటే.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో ప్రజలకు సరైన వైద్యం లేదు అనటానికి ఇదో ఉదాహరణ అంటూ మరికొందరు కౌంటర్ చేస్తున్నారు.