స్నేహంపై దేవెగౌడ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స్నేహంపై దేవెగౌడ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అతికిన మ‌న‌సులు క‌ల‌వ‌వ‌ని చెబుతారు. రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వితం కాద‌న్న మాట త‌ర‌చూ చెబుతుంటారు. దీనికి త‌గ్గ‌ట్లే.. నిన్న‌టి శ‌త్రువులు మిత్రులు కావ‌టం.. మిత్రులు కాస్తా శ‌త్రులువు కావ‌టం క‌నిపిస్తూ ఉంటుంది. ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన జేడీఎస్ నేత‌లు.. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాక‌.. సీఎం ప‌ద‌వి వ‌స్తుందంటే.. తిట్టిన తిట్ల‌ను తూచ్ అనేసి.. భుజాలు.. భుజాలు రాసేసుకొని పొత్తులు పెట్టేసుకున్నారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

సీఎం కుర్చీ ఆఫ‌ర్ ను కాద‌న‌లేక కాంగ్రెస్‌తో పొత్తుకు ఓకే అన్నారే కానీ.. వారి మ‌న‌సులు క‌ల‌వ‌లేద‌న్న మాట మొద‌ట్నించి వినిపిస్తూ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి కూడా. క్యాంప్ రాజ‌కీయాల వేళ‌లోనూ రెండు పార్టీలు వేర్వేరు హోట‌ళ్ల‌లో బ‌స ఏర్పాటు చేసుకోవ‌టం.. ఒక‌రికొక‌రు ఎదురుప‌డ‌టం లాంటివి లేవు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు ఉప ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు పోటీ ప‌డ‌నున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌లుఆస‌క్తిక‌రంగా మారాయి. నెంబ‌ర్ గేమ్ గా మారిన క‌ర్ణాట‌క రాజ‌కీయంలో అంకెలుకున్న ప్రాధాన్యం.. పొత్తుల‌కు లేద‌న్న వైనం తేలిపోయిన‌ట్లే. ఉప ఎన్నిక‌ల్లో ఏదో ర‌కంగా విజ‌యం సాధిస్తే.. అధికారాన్ని మ‌రింత సుస్థిరం చేసుకోవాల‌న్న త‌ప‌న రెండు మిత్ర‌ప‌క్షాల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. పేరుకు పొత్తే కానీ.. వారి మ‌ధ్య మ‌రెలాంటి సంబంధం లేదా? అన్న భావ‌న క‌లిగేలా ప‌రిస్థితులు ఇలా ఉన్నాయి.

తాజాగా ఈ వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరేలా పెద్దాయ‌న దేవెగౌడ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ తో త‌మ పొత్తు చాలా ప‌రిమిత‌మైన‌ద‌ని.. అది అసెంబ్లీ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితంగా ఆయ‌న తేల్చి చెప్పారు. తాజాగా రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ స్థానానికి జ‌రిగే ఎన్నిక‌ల్లో జేడీఎస్ అభ్య‌ర్థి గెలుపు కోసం తాము కృషి చేస్తామ‌ని చెప్పారు. సోమ‌వారం జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌.. జేడీఎస్.. బీజేపీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల్ని నిలిపాయి.

ఓవైపు మిత్ర‌ప‌క్షంగా ఉంటూనే కాంగ్రెస్‌.. జేడీఎస్ లు త‌మ త‌మ అభ్య‌ర్థుల్నిబ‌రిలోకి నిల‌ప‌టం ద్వారా త‌మ మ‌ధ్య పొత్తు కేవ‌లం అధికారాన్ని పంచుకోవ‌టానికి త‌ప్పించి మ‌రింకేమీ లేద‌న్న వైనాన్ని డిసైడ్ చేసిన‌ట్లుగా ఉంది. మ‌రి.. వీరి తీరుపై రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ ఓట‌ర్లు ఎలాంటి తీర్పు ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఎపిసోడ్‌లో అదిరే కొస‌మెరుపు ఏమిటంటే.. త‌న అభ్య‌ర్థిని గెలిపించాల‌ని జేడీఎస్ నేత‌లు కోరుతుంటే.. కాంగ్రెస్ అభ్య‌ర్థి మాత్రం జేడీఎస్ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి పేరు మీద ఓట్లు వేయాల‌ని కోరుతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు