ఐర్లాండ్‌లో సంచ‌ల‌న చ‌ట్టం...కార‌ణం మ‌న ఆడ‌బిడ్డే

ఐర్లాండ్‌లో సంచ‌ల‌న చ‌ట్టం...కార‌ణం మ‌న ఆడ‌బిడ్డే

ఔను. మ‌న ఆడ‌బిడ్డ వాళ్ల యూర‌ప్ దేశం త‌న చ‌ట్టాల‌ను మార్చుకుంది. ప్రజాగ్రహాం ముందు ఎంతటి కఠిన చట్టాలైనా తలొగ్గక తప్పదని ఆ దేశం  మరోమారు స్పష్టం చేసింది. గర్భస్రావ వ్యతిరేక చట్టాన్ని రద్దుచేయాలా? వద్దా? అని ఐర్లాండ్ దేశంలో శనివారం నిర్వహించిన రెఫరెండంలో 66.4 శాతం మంది అనుకూలంగా ఓటు వేసి చట్టంపై తమ నిరసనను వ్యక్తంచేశారు. 33.6 శాతం మంది మాత్రమే చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని పేర్కొన్నారు.  కాగా అంతకుముందు ఎగ్జిట్‌పోల్ అంచ నాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశాయి. చట్టాన్ని తొలగించాలని కోరుకునే వర్గం ప్రజలు భారీ తేడాతో విజయం సాధిస్తారని పోల్స్ వెల్లడించాయి. రెఫరెండానికి అనుకూలంగా భారీగా ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. ఈ చ‌ట్టం మార్పున‌కు, ఈ రెఫ‌రెండానికి భార‌తీయ మ‌హిళ‌కార‌ణం కావ‌డం గ‌మ‌నార్హం.

సరైన సమయంలో గర్భస్రావం చేయకపోవడం వల్ల 2012లో ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతి మహిళ సవిత హలప్పనవార్ మృతిచెందారు. పిండం చనిపోయిన కారణంగా తన గర్భాన్ని తొలగించాలని ఆమె కోరినప్పటికీ అక్కడి అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో రక్తం విషతుల్యం కావడంతో ఆమె మృత్యువాతపడ్డారు. ప్రాణాలు పోతున్నా రక్షించలేని చట్టాలు ఎందుకన్న ఆగ్రహం ప్రజల్లో అప్పటినుంచి బలంగా పాతుకుపోయింది. గర్భస్రావ వ్యతిరేక చట్టాన్ని తొలిగించాలని అక్కడి ప్రజలు నిర్వహించిన ఉద్యమానికి సవిత కేంద్ర బిందువుగా నిలిచారు. గర్భస్థ శిశువుకు జన్మించే హక్కుతో సమానంగా జన్మనిచ్చే తల్లికీ ఆ హక్కు ఉంటుందనే నినాదాలు వచ్చాయి. తల్లికి మరణాంతకమైతే గర్భస్రావం చేయడంలో తప్పులేదని మహిళలు ఉద్యమించారు. దీంతో రెఫ‌రెండం నిర్వ‌హించారు.

ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న ఐర్లాండ్ భారత సంతతి ప్రధాని లియో వరాడ్కర్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తాము చరిత్ర సృష్టించబోతున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ``ఈ చారిత్రాత్మక రెఫరెండంలో కఠిన చట్టాన్ని తొలగించాలని కోరుకునే వారు భారీ విజయం సాధించబోతున్నారు. ఐర్లాండ్‌లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న గర్భస్రావ వ్యతిరేక ఉద్యమం నేడు తారాస్థాయి చేరుకోవడం, ఒక విస్ప‌ష్ట తీర్పును పొంద‌నుండ‌టం మనం చూశాం`` అని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు