హై అల‌ర్ట్: హైదరాబాద్ కు పాకిన నిపా వైర‌స్?

హై అల‌ర్ట్:  హైదరాబాద్ కు పాకిన నిపా వైర‌స్?

ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలోని కేర‌ళ రాష్ట్రాన్ని నిపా వైర‌స్ వ‌ణికిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారికి చికిత్స చేసేందుకు వైద్యులు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. వ్యాధిగ్ర‌స్తుల‌ను ప్ర‌త్యేక‌మైన గ‌దుల‌లో ఉంచి వారికోసం ప్ర‌త్యేకంగా సిబ్బందిని నియ‌మించారు. ఈ నేప‌థ్యంలోనే కేర‌ళ‌ను క‌ల‌వ‌ర‌పెడుతోన్న నిపా వైరస్....తాజాగా హైద‌రాబాద్ కు పాకిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

తాజాగా హైద‌రాబాద్ లో ఇద్ద‌రు యువ‌కుల‌కు నిపా వైర‌స్ సోకిన ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డ‌డం వైద్యుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆ ఇద్ద‌రు యువ‌కుల‌కు నిపా వైరస్ సోకిందనే అనుమానం రావ‌డంతో వారికి వేర్వేరు గదుల్లో ప్ర‌త్యేక సిబ్బందితో చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్ద‌రు యువ‌కుల్లో ఒకరు...కొద్ది రోజుల క్రితం కేరళ వెళ్ళి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ యువ‌కుల రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపిన‌ట్లు వైద్యులు తెలిపారు.
 
ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ కే రమేశ్ రెడ్డి స్పందించారు. స్వైన్ ఫ్లూ ల‌క్ష‌ణాలు, నిపా ల‌క్ష‌ణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయ‌ని చెప్పారు. వారి రిపోర్ట్స్ వ‌చ్చేవ‌రుకు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. కేరళలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) అధికారులతో తాను మాట్లాడాన‌ని అన్నారు. కేరళలో ప‌ర్య‌టించిన యువ‌కుడు నిపా వైరస్ ఉధృతంగా ఉన్న‌ ప్రాంతానికి వందల కిలోమీటర్ల దూరంలో సంచరించినట్లు వారు తెలిపార‌న్నారు.

ఆ కార‌ణంతో ఆ యువకుడికి నిపా వైరస్ సోకే అవకాశాలు తక్కువన్నారు. అయిన‌ప్ప‌టికీ, ఈ వైర‌స్ జాడ న‌గ‌రంలో క‌నిపించిన ప‌క్షంలో....విస్తరించ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. నిపా వైరస్ సోకినవారికి శ్వాస సంబంధ ఇబ్బందులు, మెదడువాపు వ్యాధి, ద‌గ్గు, తీవ్ర జ్వరం, జలుబు ల‌క్ష‌ణాలుగా ఉంటాయి. గ‌బ్బిలాల వ‌ల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు