శ్రీ‌వారి ప్ర‌ధాన అర్చ‌కుడి ఇంట్లో వైఎస్ ఫొటో ఎందుకు?

శ్రీ‌వారి ప్ర‌ధాన అర్చ‌కుడి ఇంట్లో వైఎస్ ఫొటో ఎందుకు?

కొద్ది రోజులుగా టీటీడీ బోర్డు పాల‌క‌మండలిపై, ఏపీ స‌ర్కార్ పై, సీఎం చంద్ర‌బాబు నాయుడిపై తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు నాయుడు స్పందించారు.

ర‌మ‌ణ దీక్షితులు వ్యాఖ్య‌ల వెనుక కేంద్రం హ‌స్తం ఉంద‌ని, అమిత్ షా, మోదీలు....ఆయ‌న‌తో అలా మాట్లాడిస్తున్నార‌ని అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంతో కేంద్రంతో తెగ‌దెంపులు చేసుకున్నందుకే....త‌న‌పై కేంద్రం కుట్ర ప‌న్నుతోంద‌ని ఆరోపించారు. తనను అప్రతిష్ఠ పాలు చేయ‌డానికే కేంద్రం ఈ వ్యాఖ్య‌లు చేయించింద‌న్నారు.

ర‌మ‌ణ దీక్షితులును ఢిల్లీ పిలిపించుకుని మ‌రీ...త‌న‌పై తప్పుడు ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఆరోపించారు. ర‌మ‌ణ దీక్షితులు ఇంట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫొటో ఉందని.. అటువంటి వ్య‌క్తి త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ర‌మ‌ణ దీక్షితులు చేసిన ప్ర‌తి ఆరోపణలపైనా టీటీడీ ఈఓ నుంచి వివరణ కోరానని అన్నారు.

ఆ ఆరోప‌ణ‌లై సమీక్ష కూడా నిర్వ‌హించాన‌ని, స్వామిని ఎన్నడూ పస్తు పెట్టలేదని, తిరుమ‌ల‌లో అన్ని వ్య‌వ‌హారాలు బాగున్నాయ‌ని ఈవో అనిల్ సింఘాల్ తనకు చెప్పారని చంద్రబాబు అన్నారు.

ఎన్టీఆర్ ద‌గ్గ‌ర నుంచి తిరుమల పవిత్రతను కాపాడుతూ వ‌స్తున్నామ‌ని, తాను కూడా దానిని కొన‌సాగిస్తూ వ‌స్తున్నాన‌ని అన్నారు. పరమ పవిత్రమైన టీటీడీని తమ గుప్పిట్లో పెట్టుకోవాల‌ని బీజేపీ యోచిస్తోంద‌ని, అందులో భాగంగానే తిరుమ‌ల‌ను స్వాధీనం చేసుకోవడానికి కేంద్రం కుట్ర ప‌న్నింద‌ని ఆరోపించారు.

తిరుమ‌ల పరిరక్ష‌ణ పేరుతో దానిని భారత పురావస్తు విభాగానికి క‌ట్ట‌బెట్టి...త‌న క‌నుస‌న్న‌ల్లో ఉంచుకోవాల‌ని కేంద్రం ప‌థ‌కం వేసింద‌ని ఆరోపించారు. క‌లియుగ దైవం వేంకటేశ్వరస్వామి మ‌న రాష్ట్రంలో ఉండడం మన అదృష్టమని, ఆయ‌న ఆల‌యాన్ని  స్వాధీనం చేసుకునే హక్కు కేంద్రానికి లేదని చంద్ర‌బాబు అన్నారు.

భవిష్యత్‌లో త‌న‌పై ఇటువంటి అనేక ఆరోప‌ణ‌లు, కుట్ర‌లు వ‌స్తాయ‌ని, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని పిలుపిచ్చారు. ఈ త‌ర‌హా కుటిల రాజ‌కీయాలు చూసిన త‌ర్వాతే కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మ‌య్యాన‌ని చంద్ర‌బాబు అన్నారు. త‌న‌కు వెంక‌న్న ద‌య ఉంద‌ని, అలిపిరి ఘ‌ట‌న‌లో ఆయ‌న వ‌ల్లే బ‌య‌ట‌ప‌డ్డాన‌ని అన్నారు. బీజేపీ కుట్ర‌ల‌ను తిప్పికొడ‌తాన‌ని, త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే వెంక‌న్న చూస్తూ ఊరుకోబోడ‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు