సోనియాకు ఎదుర‌ప‌డ‌లేకే..కేసీఆర్ ఈ స్కెచ్ వేశారా?

సోనియాకు ఎదుర‌ప‌డ‌లేకే..కేసీఆర్ ఈ స్కెచ్ వేశారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు ఆస‌క్తిక‌రమైన అడుగు వేశారు.కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకానున్నది. ఈ నేపథ్యంలో కుమారస్వామిని అభినందించేందుకు కేసీఆర్ మంగళవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బెంగళూరు చేరుకున్నారు.

కర్ణాటక ఎన్నికల పూర్వాపరాలు, వరుస పరిణామాలపై వారు దాదాపు అరగంటపాటు చర్చించుకున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు దిశలో ఇది ఒక శుభసూచకమని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఎన్నికల ముందు నుంచి తమకు అండగా నిలిచినందుకు దేవెగౌడ, కుమారస్వామిలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ స్నేహం కొనసాగిద్దామని వారిద్దరు చెప్పినట్టు సమాచారం.కొన్ని రోజుల తరువాత మరోసారి బెంగళూరు వస్తానని, అన్ని విషయాలను చర్చించుకుందామని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.

అయితే, ప్ర‌మాణ‌స్వీకారానికి ఒక‌రోజు ముందు కేసీఆర్ ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కేసీఆర్ చెప్తున్న‌ట్లు ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు, క‌లెక్ట‌ర్ల మీటింగ్ అనేది అస‌లు కార‌ణం కానే కాద‌ని అంటున్నారు. ఎందుకంటే..కేసీఆర్ త‌లుచుకుంటే ఏ స‌మావేశాన్ని అయినా ఎప్పుడైనా ర‌ద్దు చేయించ‌గ‌ల‌ర‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ ఆ స‌మావేశాన్ని పేర్కొంటూ బెంగ‌ళూరు వెళ్ల‌డం వెనుక లెక్క‌లు వేరేన‌ని అంటున్నారు.

ప్ర‌ధానంగా కాంగ్రెస్ నేత‌లు హాజ‌రువుతున్నందున కేసీఆర్ ఇబ్బంది ప‌డి ఉంటార‌ని వివ‌రించారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌గాంధీతో పాటు ఇతర సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ర‌థ‌సార‌థి సోనియా హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ ఇంకా ఖ‌రారు కాలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి, ఆ మాట తప్పారనే అపవాదు ఆయనపై ఉంది.

దానికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండటంతో రాజకీయంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశం కూడా ఒక‌ట‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఒక రోజు ముందురోజు కుమారస్వామిని కలిసి అభినందనలు తెలిపినట్టు సమాచారం.

ఇదిలాఉండ‌గా...త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను మాత్రం వ్యూహాత్మ‌కంగా జేడీఎస్ నేత‌ల‌కు వెల్ల‌డించార‌ని, దానికి నిద‌ర్శ‌నం కాబోయే సీఎం కుమారస్వామి చేసిన కామెంట్లేన‌ని ప‌లువురు అంటున్నారు.

కేసీఆర్‌తో భేటీ అనంత‌రం కుమారస్వామి మాట్లాడుతూ, ``కర్ణాటక ముఖ్యమంత్రిగా నా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక కారణాల వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాలేకపోతున్నారు. అందుకే ఆయన ముందస్తుగానే బెంగళూరు వచ్చి, శుభాకాంక్షలు తెలిపారు`` అని చెప్పారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ బెంగళూరు వచ్చినప్పుడు కర్ణాటకలోని తెలుగువారంతా జేడీఎస్‌కే ఓటువేయాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు