యెడ్డీ, శ్రీ‌రాములు ఎఫెక్ట్‌... వైసీపీ ఎంపీల‌కు పిలుపు

యెడ్డీ, శ్రీ‌రాములు ఎఫెక్ట్‌... వైసీపీ ఎంపీల‌కు పిలుపు

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించిన వైసీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 29న వైసీపీ ఎంపీలతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పీకర్ కార్యాలయంలో భేటీ కానున్నారు.

రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వైసీపీ ఎంపీలు స్పీకర్‌ను కోరారు. కలిసేందుకు సమయం ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ స్పీకర్‌కు సందేశం పంపారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ను వ్యక్తిగతంగా భేటీ కావాలని వైసీపీ ఎంపీలకు తాజాగా స్పీకర్ కార్యాలయం ఈ-మెయిల్ పంపింది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే వరకు సభలో పోరాటం చేశారు. సభ వాయిదా పడగానే గత నెల 6వ తేదీన వైసీపీకి చెందిన లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి రాజీనామా చేశారు. మొత్తం ఐదుగురు ఎంపీలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించడమే కాదు... వెంటనే తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా నెలన్నర గడుస్తున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సందేహాలు నెల‌కొన్నాయి.

మ‌రోవైపు క‌ర్నాటకలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన యడ్యూరప్ప, శ్రీరాములు లోక్‌సభను రాజీనామా చేస్తే స్పీకర్ సుమిత్రా మహాజన్ వెంటనే ఆమోదించారు. అయితే, వైసీపీ ఎంపీల‌కు రాజీనామాలు ఆమోదం పొంద‌క‌పోవ‌డం కొత్త చ‌ర్చ‌కు దారితీసింది.

మ‌రోవైపు ఈ ప‌రిణామం ఇటు వైసీపీ మెడ‌కు, అటు బీజేపీకి చుట్టుకుంది. హోదా కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్నామని... అందుకు తమ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పీకర్‌పై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని అధికార టీడీపీ ప్ర‌శ్నించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం వెనుక బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణమా అనే సందేహాన్ని వ్య‌క్తం చేసింది. రాజీనామాలు ఆమోదిస్తే బై ఎలక్షన్స్ వచ్చి... ఒకవేళ ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైతే... వచ్చే ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందని భావిస్తున్న బీజేపీ... వైసీపీకి అనుకూలంగా పరిస్థితి ఉండేందుకే రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలేదా అని రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ జ‌రిగింది.

ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీ ఎంపీల‌కు పంపిన ఈమెయిల్‌లో ఈనెల 29న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సమావేశం కావాలని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ఎంపీల రాజీనామాల విష‌యంలో చ‌ర్చించి స్పీక‌ర్ ఏం నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది. నిబంధ‌న ప్ర‌కారం ఎన్నికలకు ఏడాది ముందుగానే సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే బై ఎలక్షన్‌కి వెళ్లాల్సి ఉంటుంది... వైసీపీ ఎంపీలు రాజీనామాలు జూన్‌ 2వ తేదీలోగా ఆమోదం పొందితేనే ఉప ఎన్నికలు వస్తాయి. కానీ, ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు