బాబు లెక్కః బీజేపీ వ‌ల్ల 15 సీట్లు కోల్పోయాం

బాబు లెక్కః బీజేపీ వ‌ల్ల 15 సీట్లు కోల్పోయాం

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కొత్త లెక్క‌లు తెస్తున్నారు. కొద్దికాలం క్రితం వ‌ర‌కు రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీని ఎందుకు గెలిపించాలి? ఎన్ని సీట్ల‌తో గెలిపించాలో వివ‌రించిన చంద్ర‌బాబు ఇప్పుడు గ‌త ఎన్నిక‌ల‌పై పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తమ తాజా మాజీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు. అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు విభజన అనంతరం కట్టుబట్టలతో బయటకు వచ్చిన రాష్ట్ర ప్రజలకు కేంద్రం సహకరించలేదన్నారు.

‘ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని నమ్మబలికారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అందువల్లే 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అయితే కేంద్రం అన్యాయం చేసింది.  దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినప్పటికీ, 11 రాష్ట్రాలకు హోదాతో సమానంగా కేంద్రం ఆర్థిక సాయం చేసింది. కానీ ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. ఆర్థిక సాయమూ చేయలేదు`` అని చంద్రబాబు అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు కారణంగా 15 స్థానాలు కోల్పోయామ‌ని చంద్ర‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని బాబు ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు తనను పొగిడిన పవన్ ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోనూ కుట్ర రాజకీయాలకు బీజేపీ తెర తీసిందని, అందుకే ఆ పార్టీని ఓడించాలని అక్కడి తెలుగువారిని కోరామన్నారు. అక్కడ బీజేపీ ఓడిపోయినందుకు ఆనందంగా ఉందన్నారు.

 సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకోవడం వల్లే కర్నాటకలో బీజేపీకి అధికారం దక్కకుండా పోయిందని బాబు అన్నారు. జేడీఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారంటే సుప్రీంకోర్టు చూపిన చొరవ తప్ప మరొకటి కాదని కొనియాడారు. ‘నన్ను అవినీతిపరుడంటున్నారు. నా హయాంలో ఏ ఒక్క కుంభకోణమూ లేదు.. అవినీతి ఆరోపణలు లేవు. నాపై వేసిన వేసిన కేసులు వీగిపోయాయి. నా పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ ఉన్నా నిరూపించండి’ అంటూ సీఎం సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అవినీతిని ప్రక్షాళన చేస్తున్నానన్నాను.

రాష్ట్రంలో బీజేపీ, వైకాపా కుట్రలు, కుతంత్రాలను ఇకపై సాగనీకుండా చిత్తుగా ఓడించి పుట్టగతులు లేకుండా చేయాలని, టీడీపీని గెలిపించాల‌ని ప్రజలకు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని, ఈ పోరాటం ఆగదని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల బ్యాంకులపై నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ‌రావ‌తిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామ‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు