క్యాంప్ రాజ‌కీయాల ప‌వ‌ర్‌..ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం

క్యాంప్ రాజ‌కీయాల ప‌వ‌ర్‌..ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం

ఎంతో ఉత్కంఠ‌ను సృష్టించిన క‌న్న‌డ రాజకీయాల‌కు శుభం కార్డు ప‌డిన సంగ‌తి తెలిసిందే. బలనిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ప్రమాణస్వీకారానికి కేసీఆర్, చంద్రబాబు, మమతలకు ఆహ్వానంకర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతాబెనర్జీ సహా పలువురు ప్రముఖులకు, ప్రాంతీయపార్టీల నేతలకు ఆహ్వానం అందింది. ఈనెల 23న కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌కు కార‌ణ‌మైన వ్య‌క్తికి ఓ భారీ గిఫ్ట్ ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా.

సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. దీనిపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్-జేడీఎస్ ఓ సమన్వయకమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ 20, జేడీఎస్ 13 మంత్రి పదవులు దక్కేలా ఇరుపార్టీలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. 78స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు ఉపముఖ్యమంత్రి పదవితోపాటు పలు కీలకశాఖలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవితోపాటు కీలకమైన ఆర్థికశాఖను కూడా కుమారస్వామి తనవద్దే ఉంచుకుంటారని జేడీఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేత జే.పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రితోపాటు కీలకమైన హోంశాఖను అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.పరమేశ్వరకు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు కుమారస్వామి ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

మరోవైపు కర్ణాటక ఎపిసోడ్‌లో కీలకంగా వ్యవహరించి ఎమ్మెల్యేలను కాపాడడంలో సఫలీకృతుడైన డీకే శివకుమార్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నేడు జేడీఎస్ అధినేత కుమారస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్, పరమేశ్వర ఢిల్లీకి వెళ్తున్నారు. సోనియా, రాహుల్ సమక్షంలో పదవుల పంపకంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ఢిల్లీ పెద్ద‌లు శివ‌కుమార్ వైపే మొగ్గుచూప‌వ‌చ్చ‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో కర్ణాటకలో సహజంగానే ఉండే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులనూ నియమించే అవకాశం ఉందన్న ఊహాగానాలూ వెలువడుతున్నాయి.