ఎమ్మెల్యేల‌కు హోంసిక్‌..

ఎమ్మెల్యేల‌కు హోంసిక్‌..

క‌న్న‌డ రాజ‌కీయాల క్రేజీ వార్త‌ల అప్‌డేట్ ఇంకా ముగియ‌డం లేదు!  ముందు హోరాహోరిగా సాగిన పోరు...అనంత‌రం క్యాంప్ రాజ‌కీయాల జోరుతో క‌న్న‌డ రాజ‌కీయం హాట్‌హాట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. సీఎం పీఠంపై క్లారిటీ రావ‌డంతో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది అనుకుంటున్న ద‌శ‌లో ఇంకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు హోం సిక్ మొద‌ల‌యింది.

శ‌నివారం యడ్యూరప్ప సీఎంగా తప్పుకోవడంతో ఆదివారం ఉదయం వీళ్లను పంపించేయాలని అనుకున్నా.. తర్వాత మళ్లీ వద్దనుకున్నారు. మరో మూడు రోజుల సమయం ఉండటంతో బీజేపీ వాళ్లను లాక్కుంటుందన్న భయం కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో ఇంకా ఉంది. దీంతో ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.

కర్ణాటకలోకి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా మే 15 నుంచి వీళ్లంతా కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర్లోని హిల్టన్ హోటల్లో ఉండగా.. జేడీఎస్ ఎమ్మెల్యేలు దొడ్డబళ్లాపూర్‌లోని రిసార్ట్‌లో ఉన్నారు. నాలుగు రోజులు కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాపగౌడ పాటిల్ ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంప్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలంతా గురువారం వరకు హోటళ్లలోనే ఉంటారని కేపీసీసీ చీఫ్ పరమేశ్వర స్పష్టంచేశారు. దీంతో త‌మ పరిస్థితి దారుణంగా మారిందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. దగ్గర్లో ఉన్న బంధువుల ఇంటికైనా వెళ్లొస్తామని బతిమాలుకున్నా వదలడం లేదని ఎమ్మెల్యేలు మీడియా మిత్రులతో ఫోన్  సంభాష‌ణ‌ల్లో వెల్ల‌డిస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్లంతా పార్టీతో ఉండటం ఎంత ముఖ్యమో వివరించారు. బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను లాగడానికి ప్రయత్నిస్తున్నదని శివకుమార్ చెప్పారు. గురువారం అసెంబ్లీలో కుమారస్వామి బల నిరూపణ పూర్తయ్యే వరకు ఎవరినీ ఎక్కడికి పంపించేది లేదని తేల్చి చెబుతుండ‌టంతో చాలా రోజులైంది.. ఓసారి వెళ్లి భార్యాపిల్లలను చూసి వచ్చే అవ‌కాశం కూడా లేక‌పాయే అని ఎమ్మెల్యేలు మ‌ధ‌న‌ప‌డుతున్నారు. క్యాంపు రాజ‌కీయాలు ఏమో కానీ త‌మ‌కు కొత్త క‌ష్టాల‌ను తెచ్చిపెట్టాయ‌ని త‌మ‌లో తామే చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు