ఏపీ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం...36మంది వీఐపీలు సేఫ్!

ఏపీ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం...36మంది వీఐపీలు సేఫ్!

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్ కు పెను ముప్పు త‌ప్పింది. ఆ ప్ర‌మాదం నుంచి 36 మంది వీఐపీల‌తో పాటు 65 సామాన్యులు తృటిలో ప్రాణాలు ద‌క్కించుకున్నారు. ఢిల్లీ నుంచి విశాఖ వస్తోన్న ఏపీ ఎక్స్‌ప్రెస్ లో బిర్లా నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద హ‌ఠాత్తుగా మంటలు చెలరేగ‌డంతో 4 బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. బోగీలో షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బి-5, బి-6, బి-7 బోగీలకు మంట‌లు వేగంగా వ్యాపించాయి. ఆ మూడు బోగీల‌లో 65 మంది విశాఖ ప్రయాణికులుండ‌గా...వారిలో 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు కూడా ఉన్నారు. ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ పెను ప్ర‌మాదం నుంచి 36 మంది వీఐపీల‌తోపాటు మొత్తం 65 మందిని సుర‌క్షితంగా వేరే బోగీల‌కు త‌ర‌లించారు.

హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడటంతో ఈ ప్ర‌మాదం సంభవించి ఉంటుందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు, ఏపీ ఎక్స్ ప్రెస్ కు సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో బిర్లానగర్‌ స్టేషన్‌ వద్ద రైలు ఆగి ఉంది. ఆ స‌మ‌యంలోనే ప్ర‌మాదం జ‌రిగింది. ఒక వేళ రైలు క‌దిలి ఉంటే....ప్ర‌యాణికులు రైలు లో నుంచి దూకాల్సి వ‌చ్చేద‌ని....మంట‌లు కూడా వేగంగా వ్యాపించి ఉండేవ‌ని అధికారులు అంటున్నారు. రైలు ఆగి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్ర‌యాణికులు కూడా తెలిపారు.

ప్ర‌మాదం గురించి తెలుసుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది వెంట‌నే స్పందించి మంటలను అదుపులోకి తేవ‌డంతోనే పెను ప్ర‌మాదం త‌ప్పింది. పూర్తిగా కాలిపోయిన నాలుగు బోగీలను వదిలేసి ప్రయాణికులను వేరే బోగీల్లోకి త‌ర‌లించిన త‌ర్వాత‌ రైలు బయలుదేరింది. అయితే, ఈ ప్రమాద ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌నే విష‌యంపై రైల్వే శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు