కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేసిన కుమారస్వామి

కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేసిన కుమారస్వామి

కయ్యమాడినోళ్లతో వియ్యమాడిన వారింటికి వెళ్లాలా వద్దా? తెలంగాణ సీఎం కేసీఆర్ మదిని ప్రస్తుతం తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో కదలిక తేవాలని తపిస్తున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన మొన్న కర్ణాటక ఎన్నికల ముందు అక్కడి జేడీఎస్ అధినేత దేవెగౌడను కూడా కలిశారు. అంతేకాదు.. కర్ణాటకలోని తెలుగు ప్రజలు ఆ పార్టీకి ఓటేయాలంటూ పిలుపిచ్చారు కూడా. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు జేడీఎస్ నేత, కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు. కానీ..  వెళ్లాలా వద్దా అని కేసీఆర్ నిర్ణయించుకోలేకపోతున్నారట. అందుకు కారణం.. జేడీఎస్ కాంగ్రెస్‌తో జతకట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుండడమే.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆరెస్‌కు కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కర్ణాటక ఎన్నికలప్పుడు అక్కడ స్థిరపడిన తెలుగువారు జేడీఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ కు ప్రధాన శత్రువులని చెప్పారు కూడా. కానీ.. తాను ప్రచారం చేసిన పార్టీ ఇప్పుడు అదే శత్రువుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తోంది. ఆ వేడుక చూడ్డానికి తనని రమ్మని పిలిచింది.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుమారస్వామి ప్రమాణ స్వీకారం పిలుపు అందుకుని బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది.  అయితే... మొన్న యడ్యూరప్ప బలపరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహించిన జేడీఎస్ ఆ సమయంలో కేసీఆర్‌తో మాట్లాడిందని చెబుతున్నారు.  హైదరాబాద్ కు తమ ఎమ్మెల్యేలను పంపేముందు ఏర్పాట్లు, భద్రత విషయంలో కేసీఆర్‌తో దేవెగౌడ, కుమారస్వామి ఇద్దరూ ఫోన్లో మాట్లాడారని సమాచారం. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ విషయంలో కర్ణాటకను వేరుగా, తెలంగాణను వేరుగా చూస్తూ భవిష్యత్తును దృష్టితో పెట్టుకుని జేడీఎసస్‌తో స్నేహం కొనసాగించవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. కుమారస్వామి గత రాజకీయ చరిత్రను చూసినా కాంగ్రెస్‌తో ఆయన పొత్తు ఎంతకాలమన్నదీ అనుమానమే. కాబట్టి మళ్లీ జేడీఎస్‌ తమకు అనుకూలం కావచ్చన్న కోణంలో ఆయన బెంగళూరు వెళ్లొచ్చని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు