మైనార్టీ స‌ర్కారుకు చేరువలో మోడీ ప్రభుత్వం

మైనార్టీ స‌ర్కారుకు చేరువలో మోడీ ప్రభుత్వం

దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన క‌ర్ణాట‌క రాజ‌కీయ చద‌రంగం ఓ కొలిక్కి వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల‌ను పావులుగా చేసుకొని కాంగ్రెస్ కు బీజేపీ చెక్ పెడ‌దామ‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే, కింగ్ మేక‌ర్ నుంచి కింగ్ గా మారిన కుమార స్వామి....కాంగ్రెస్ అధిష్టానం క‌లిసి బీజేపీ ఎత్తుల‌కు పై ఎత్తు వేయ‌డంతో క‌మ‌ల‌నాథులకు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. అయితే, గ‌త వారం రోజుల నుంచి....క‌ర్ణాట‌క అసెంబ్లీలో ఏ పార్టీ బ‌ల‌మెంత‌....మ్యాజిక్ ఫిగ‌ర్ ఎంత‌....అన్న దానిపై చాలామంది చ‌ర్చోప‌చర్చ‌లు జ‌రిపారు.

కానీ, క‌ర్ణాట‌క అసెంబ్లీలోని `కురుక్షేత్రం` ప్రభావం....లోక్ స‌భ‌లో బీజేపీపై ప‌డిన సంగ‌తిని చాలామంది గ‌మ‌నించి ఉండ‌రు. లోక్ స‌భ‌లో బీజేపీ ఎంపీల మెజారిటీ 270కు త‌గ్గింద‌ని....బీజేపీ మ‌రో 2 ఎంపీ సీట్లు కోల్పోతే ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగ‌ర్ పోతుంద‌ని గుర్తించి ఉండ‌రు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న నాలుగు లోక్ స‌భ స్థానాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి బీజేపీ మైనారిటీలో ప‌డ‌బోతోంద‌న్న సంగ‌తి కూడా చాలా మందికి తెలిసి ఉండ‌దు.


2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 543 ఎంపీ స్థానాల‌కు గానూ 285 ఎంపీ స్థానాల‌ను గెలుచుకున్న బీజేపీ ....30 సంవ‌త్స‌రాల త‌ర్వాత పూర్తి మెజారిటీ ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన సంగ‌తి తెలిసిందే. దీనికితోడు శివ‌సేన స‌హా కొన్ని పార్టీలు మోదీ స‌ర్కార్ కు మ‌ద్ద‌తివ్వ‌డంతో బీజేపీ బ‌లం మ‌రింత పెరిగింది. అయితే, 2018 ప్రారంభం నాటికి బీజేపీ సీన్ మారిపోయింది. 2018 మొద‌ట్లో బీజేపీకి లోక్ స‌భ‌లో 274 మంది ఎంపీల మ‌ద్ద‌తుంది. ఆ పార్టీ రెబెల్స్ శ‌త్రుఘ్న సిన్హా, కీర్తి ఆజాద్ ల‌ను లెక్క‌లోనుంచి తీసేస్తే ఆ సంఖ్య 272కు త‌గ్గుతుంది. తాజాగా య‌డ్యూర‌ప్ప‌, శ్రీ‌రాములు రాజీనామా చేయ‌డంతో ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో బీజేపీ బ‌లం 270కు త‌గ్గింది.

వివిధ కార‌ణాల వ‌ల్ల లోక్ స‌భ‌లో 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో, ప్ర‌స్తుతం ఉన్న 536 ఎంపీ సీట్ల‌కు గాను 268 మ్యాజిక్ ఫిగ‌ర్ అయింది. దీంతో, ఇప్ప‌టికిప్పుడు మోదీ స‌ర్కార్ కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ, ఈ నెల 28న 4 లోక్ స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఆ నాలుగింటిలో రెండు స్థానాల‌లో బీజేపీ ఓట‌మిపాలైనా....లోక్ స‌భ‌లో మెజారిటీ కోల్పోతుంది. ఒక‌వేళ రెండు లేదా నాలుగు స్థానాల్లో బీజేపీ ఓడిపోతే...ఆ పార్టీ మ్యాజిక్ నంబ‌ర్ ను...శివ‌సేన డిసైడ్ చేస్తుంది. ప్ర‌స్తుతం బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న శివ‌సేన‌కు 18 స్థానాలున్నాయి. అయితే, బీజేపీ ఒంటెత్తుపోక‌డ న‌చ్చ‌క‌పోవ‌డంతో....ఆ పార్టీపై సంద‌ర్భానుసారంగా శివ‌సేన విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోంది. ఈ నేప‌థ్యంలో...ఒక‌వేళ బ‌ల‌ప‌రీక్ష‌కు వెళితే బీజేపీకి శివ‌సేన మ‌ద్ద‌తునిస్తుందా లేదా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు