క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ చేసిన మ్యాజిక్ ఏంటి?

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ చేసిన మ్యాజిక్ ఏంటి?

వందేళ్ల పార్టీ. నిన్న మొన్న వ‌చ్చిన మోడీ చేతిలో చావు దెబ్బ తిన్న‌ది. 2014లో కాంగ్రెస్ కుంభ‌స్థ‌లం మీద కొట్టిన మోడీ ఆ త‌ర్వాత కూడా దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నాడు. అనుభ‌వం సంక‌లో పెట్టుకున్న వందేళ్ల పార్టీ చ‌తికిల ప‌డుతూనే వ‌స్తోంది. ఎందుకు ఈ ప‌రంపర కొన‌సాగింది? అంటే స‌మాధానం... కాంగ్రెస్ విధానాలు, నిర్ల‌క్ష్యం, దాని తాబేలు ప‌రుగే.

అయితే, జ‌ర‌గాల్సిన భారీ న‌ష్టం జ‌రిగిపోయినా... ఒక పెద్ద‌, చివ‌రి అవ‌కాశం వ‌చ్చేట‌ప్పటికి కాంగ్రెస్ త‌నకు అల‌వాటైన అవ‌ల‌క్ష‌ణాల‌ను ప‌క్క‌న పెట్టి, మాస్ట‌ర్ స్ట్రాట‌జీతో మోడీని చావు దెబ్బ కొట్టింది. రాజ‌కీయంగా తాను గెల‌వ‌డ‌మే కాకుండా... దేశం మొత్తం త‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికే విధంగా ప‌రిస్థితిని సృష్టించి... మోడీ ఇమేజ్‌ను కూడా ఎంతో కొంత‌ డ్యామేజ్ చేయ‌గ‌లిగింది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. మ‌రి క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌ను గ‌ట్టెక్కించిన ఆ మాస్టర్ స్ట్రాట‌జీ ఏంటా అని ఆరాతీస్తే... అవాక్క‌వ‌క త‌ప్ప‌దు.

సాధార‌ణంగా కాంగ్రెస్ నిర్ణ‌యాలు వాయిదాల వ్య‌వ‌హారమే. కానీ 2019ని దృష్టిలో పెట్టుకుని, రాహుల్ ఇమేజ్ మ‌రింత దిగ‌జార‌కుండా ఉండేందుకు రాష్ట్రంలో 78 స్థానాలు గెలిచిన ఆ పార్టీ కేవ‌లం ఒక్క గంట‌లో నిర్ణ‌యం తీసుకుని జేడీఎస్ కు సీఎం ప‌ద‌విని త్యాగం చేసింది. అది జేడీఎస్‌పై ప్రేమా కాదు, అధికారంపై ఆశా కాదు... కేవ‌లం మోడీ మీద గెలుపుకోసం. ఉన్న‌ది ఆ ఒక్క ఆప్ష‌నే గానీ మోడీ ఊహించ‌నంత వేగంగా నిర్ణ‌యం తీసేసుకుంది. ఇది మోడీపై కొట్టిన ఫ‌స్ట్ మాస్ట‌ర్ స్ట్రోక్‌.  అప్ప‌టికీ మోడీ -షా ద్వ‌యం జంక‌లేదు. కాంగ్రెస్ నెక్ట్స్ స్టెప్‌ను అంచ‌నా వేయ‌లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేల‌ను కొనేయ‌గ‌ల‌మ‌నే గుడ్డి ధైర్యం. కొంత అహంకారం. కానీ అక్క‌డే కాంగ్రెస్ అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ప‌దిహేను ఇర‌వై కోట్లు పెట్టి  గెలిచిన వారికి పాతిక ముప్పై కోట్లు (వంద కోట్లు అంటున్నా అది అబ‌ద్ధం) ఆశ చూపితే ఎవ‌రైనా ఆశ‌ప‌డ‌తారు. పైగా ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశ‌మూ ఉంటుంది. దాన్ని ఏ ఎమ్మెల్యే మాత్రం వ‌దులుకుంటాడు. ఈ జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను కాంగ్రెస్ వేగంగా ప‌సిగ‌ట్టింది. సీఎల్పీ మీటింగ్‌లో ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ నిర్ణ‌య‌మే బీజేపీకి చావుదెబ్బ‌. ఎవ‌రైతే త‌మ‌తో బీజేపీ చేసిన బేర‌సారాల టేపులు తెస్తారో... వారికి బీజేపీ చేసిన ఆఫ‌ర్లు సొంత పార్టీలోనే ఇస్తాం అని వ్య‌క్తిగ‌తంగా చెప్పార‌ట‌. *అమ్ముడుపోయాడు* అనే నింద ప‌డ‌కుండా అదే ఆదాయం, ప‌ద‌వి వ‌స్తుందంటే ఇక ఏ ఎమ్మెల్యే అయినా ఎందుకు బ‌య‌ట‌కువెళ్తాడు. ఇదే స్ట్రాట‌జీ కాంగ్రెస్‌ను క‌ర్ణాట‌క‌లో నిల‌బెట్టింది. దీనిని బీజేపీ క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. అందుకే బ‌ల‌నిరూప‌ణకు ముందే ప‌ద‌వి వ‌దిలేశాడు య‌డ్యూర‌ప్ప‌. కాంగ్రెస్ దెబ్బ‌కు ఇప్ప‌టికీ ఇంకా మోడీ-షా ద్వ‌యం కోలుకోలేదట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు