భార‌త్‌.. చైనా బోర్డ‌ర్ లో బంగారు.. వెండి గ‌నులు?

భార‌త్‌.. చైనా బోర్డ‌ర్ లో బంగారు.. వెండి గ‌నులు?

ఇప్ప‌టికే అంతంత‌మాత్రంగా ఉన్న భార‌త్.. చైనా సంబంధాలకు బంగారు గ‌నులు ప‌రీక్ష‌గా మార‌నున్నాయా? అంటే అవున‌నే మాట‌ను చెబుతోందో అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తాజాగా ఒక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. భార‌త్‌.. చైనా స‌రిహ‌ద్దుల్లో భారీగా బంగారు.. వెండి గ‌నుల్ని చైనా గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు.

దాదాపు 4ల‌క్ష‌ల కోట్ల రూపాయిల విలువైన ఖనిజాలు చైనా అధీనంలో ఉన్న భూభాగంలో ఉన్న‌ట్లుగా స‌ద‌రు మీడియా సంస్థ పేర్కొంది. ఈ గ‌నులు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌ట్లుగా వెల్ల‌డించింది. బంగారం.. వెండితో పాటు మ‌రిన్ని ఖ‌రీదైన ఖ‌నిజాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఆ ప్రాంతం ఉన్న‌ట్లుగా తేలిన‌ట్లు తెలియ‌జేసింది. ఈ ఖ‌నిజాల కోసం చైనా ఇప్ప‌టికే త‌వ్వ‌కాలు చేప‌ట్టింద‌ని చెప్పింది.

అయితే.. ఈ గ‌నుల ముచ్చ‌ట కొత్త కాద‌ని.. పాత‌దేన‌ని.. ఖ‌నిజాల కోసం ఇక్క‌డ తవ్వ‌కాలు ఎప్ప‌టి నుంచో జ‌రుగుతున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఈ మ‌ధ్య‌న భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచ‌టం.. భారీగా త‌వ్వ‌కాల్ని చేప‌ట్ట‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చైనా భూభాగంలో ఉన్న గ‌నుల‌తో భార‌త్ కు వివాదం ఏమిట‌న్న విష‌యంలోకి వెళితే.. ఈ భారీ గ‌నులు భార‌త్‌కు చెందిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ తో పంచుకుంటున్న స‌రిహ‌ద్దుల్లో ఉండ‌టంగా చెబుతున్నారు.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ‌ద‌ని.. ద‌క్షిణ టిబెట్ లో ఆ రాష్ట్రం భాగంగా చైనా మూర్ఖ‌వాద‌న‌ను వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వేళ భారీ ఎత్తున ఉన్న ఖ‌నిజాల్ని త‌మ సొంతం చేసుకోవాల‌న్న చైనా దురాశ‌.. రెండు దేశాల మ‌ధ్య సంబంధాల్ని మ‌రింత ప్ర‌భావితం చేస్తుంద‌ని తాజా క‌థ‌నం పేర్కొంది. ద‌క్షిణ టిబెట్ ను చేజిక్కించుకోవ‌టానికి చైనా వేసిన మాస్ట‌ర్ ప్లాన్ లో భాగ‌మే.. ఇటీవ‌ల పెంచిన గ‌నుల త‌వ్వ‌కాలుగా అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి.. ఈ ఉదంతంలో మోడీ స‌ర్కార్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు