కుమార‌స్వామికి పిలుపు.. నేడు సీఎంగా ప్ర‌మాణం!

కుమార‌స్వామికి పిలుపు.. నేడు సీఎంగా ప్ర‌మాణం!

ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది క‌ర్ణాట‌క రాజ‌కీయం. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ మొద‌లే.. ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ వ్యాప్తంగా ప్ర‌భావితం చేస్తాయ‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీనికి త‌గ్గ‌ట్లే.. క‌న్న‌డ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో బీజేపీ త్రిశుంక స్వ‌ర్గంతో తేలియాడుతూ.. అత్యాశ‌కు పోయి అంతులేని అవ‌మానాన్ని సొంతం చేసుకుంది.

చేతిలో అధికారం ఉన్న వేళ‌.. ఏమైనా చేయ‌గ‌ల‌న్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ వారిని తీవ్రంగా దెబ్బ తీసింది. ప్ర‌లోభాల ప‌ర్వంతో ప్ర‌త్య‌ర్థుల్ని చిత్తు చేస్తామ‌ని భావించినా.. విప‌క్షాలు దెబ్బ తిన్న బెబ్బులిలా మారి.. బీజేపీ స‌ర్కారును గ‌ద్దె దించ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా పంతం ప‌ట్టి మ‌రీ.. ఏక‌తాటి మీద నిలిచి మ‌రీ మోడీషాల‌కు దిమ్మ తిరిగే షాకిచ్చారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు క‌ర్ణాట‌క అసెంబ్లీలో నిర్వ‌హించాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే.. ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో గ‌డిచిన రెండు రోజులుగా న‌డిచిన హైడ్రామా రాజ‌కీయం ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లైంది. తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన య‌డ్డీ.. అసెంబ్లీ నుంచి నేరుగా గ‌వ‌ర్న‌ర్ నివాసానికి వెళ్లారు. అక్క‌డ గ‌వ‌ర్న‌ర్ కు రాజీనామా ఇచ్చేసిన‌ట్లు చెబుతున్నారు.

మ‌రోవైపు.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన ఎమ్మెల్యేల బ‌లం త‌న‌కుంద‌ని ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ముందు జాబితా పెట్టిన కుమార‌స్వామిని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. గ‌వ‌ర్న‌ర్ నుంచి ఈ రోజు పిలుపు ఖాయ‌మ‌ని.. పిలుపు వ‌చ్చిన వెంట‌నే.. కుమార‌స్వామి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని తెలుస్తోంది. ఈ రోజు కాస్త లేటు అయినా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం ఖాయ‌మంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు