క‌న్న‌డ సీన్ః ఒత్తిడిలో మూడు రాష్ట్రాల గవర్నర్లు

క‌న్న‌డ సీన్ః ఒత్తిడిలో మూడు రాష్ట్రాల గవర్నర్లు

ఒక్క రాష్ట్రం కోసం ఆరాట ప‌డ్డ బీజేపీ మూడు రాష్ర్టాల్లో ఇర‌కాటంలో ప‌డుతోంది. సద‌రు ప‌రిణామాల కార‌ణంగా ఆ రాష్ర్టాల్లోని గ‌వ‌ర్న‌ర్లు సైతం ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని తెలుస్తోంది. కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సరికొత్త వ్యూహాన్ని అనుసరించాయి. కర్ణాటక తరహాలోనే తమ రాష్ర్టాల్లోనూ అతిపెద్ద పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని బీహార్, మణిపూర్, గోవాలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు బీహార్‌లో ఆర్జేడీ, గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీల పక్షనేతలు గవర్నర్‌ను కలిసి లేఖలు అందజేశాయి. అయితే ప్రతిపక్షాల చర్యలను హాస్యాస్పదమని అధికారపక్షాలు వ్యాఖ్యానించాయి.

బీహార్‌లో లాలూప్రసాద్‌యాదవ్ కుమారుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్  తన నివాసంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం మిత్రపక్షాలైన కాంగ్రెస్-హిందుస్థానీ అవామీ మోర్చా-సీపీఐ (ఎంఎల్) ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిశారు. ఆర్జేడీ 80 మంది ఎమ్మెల్యేలతో బీహార్‌లో అతిపెద్ద పార్టీగా ఉన్నదని, కర్ణాటకలో మాదిరిగా తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమ కూటమికి 111 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, అధికార జేడీయూ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా సంఖ్యాబలం తమకు ఉన్నదని, అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. బీహార్‌లో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుంటే, నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టుకు ఈడుస్తామని పేర్కొన్నారు.

మ‌రోవైపు గోవా గ‌వ‌ర్న‌ర్‌కు ఏకంగా చిత్ర‌మైన స‌మ‌స్య ఎదురైంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏకంగా గ‌వ‌ర్న‌ర్‌కే డెడ్‌లైన్ విధించాయి. గోవాలో కాంగ్రెస్ పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం గవర్నర్ మృదులా సిన్హాను కలిశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచిందని, కర్ణాటకలో మాదిరిగా తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతిపత్రం అందజేశారు. తమకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని చెప్పారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది తమకన్నా తక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని, ఇప్పుడు ఆ తప్పు దిద్దుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరామన్నారు. తమ విన్నపంపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌కు ఏడు రోజుల గడువు విధించామని వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు మణిపూర్‌లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఓక్రం ఇబోబీ సింగ్ నేతృత్వంలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో తాత్కాలిక గవర్నర్ జగదీశ్ ముఖర్జీని కలిశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకుగానూ కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్దగా పార్టీగా నిలిచిందని పేర్కొన్నారు.

కేవలం 21 చోట్ల నెగ్గిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో గవర్నర్ తీసుకున్న నిర్నయం మాదిరిగా అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్నారు. కాగా, క‌న్న‌డ క‌ల‌క‌లం కార‌ణంగా మూడు రాష్ర్టాల్లోని గ‌వ‌ర్న‌ర్ల‌పై ఒత్తిడి పెరుగుతోంద‌నే చ‌ర్చ  జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు