ద‌య‌చేసి ఎమ్మెల్యేల‌ను అమ్మ‌వ‌ద్దు...

ద‌య‌చేసి ఎమ్మెల్యేల‌ను అమ్మ‌వ‌ద్దు...

``ద‌య‌చేసి ఎమ్మెల్యేల‌ను అమ్మ‌వ‌ద్దు...ఐపీఎల్‌లో వేలం వేసిన‌ట్లు ఎమ్మెల్యేల‌ను బ‌జార్లో నిల‌బెట్ట‌వ‌ద్దు``ఇది నినాదం. ఇలా రోడ్డెక్కింది ఎవ‌రో తెలుసా సాక్షాత్తు కేంద్ర‌మంత్రి తండ్రి. ఒక‌నాటి మాజీ కేంద్ర‌మంత్రి. ఇంత‌కీ ఎవ‌రా ప్ర‌ముఖుడు అంటే...ఇటీవ‌లి కాలంలో బీజేపీ తీరుపై భ‌గ్గుమంటున్న మాజీ ఆర్థిక‌శాఖ మంత్రి య‌శ్వంత్ సిన్హా.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో క్రికెటర్లను వేలంలో కొనుక్కున్నట్టు.. ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌ కింద కర్నాటక ఎమ్మెల్యేలను వేలంలో కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ మాజీ నేత యశ్వంత్‌ సిన్హా ఆరోపించారు. మెజారిటీ సీట్లు లేని బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ఆహ్వానించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ ముందు రాష్ట్రీయ మంచ్‌ పేరిట 'సేవ్‌ డెమోక్రసీ' నినాదంతో సిన్హా ధర్నాకు దిగి ఈ వ్యాఖ్యాలు చేశారు.

ఆందోళ‌న సంద‌ర్భంగా సిన్హా మీడియాతో మాట్లాడుతూ కర్నాటక ఎమ్మెల్యేల వేలం జరగొద్దని అన్నారు. గవర్నర్‌ వాజుభాయి వాలా నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదని..ఇది ప్రజాస్వామ్యాన్ని హత్యచేసేలా ఉన్నదని చెప్పారు.  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎనిమిది సీట్లు తక్కువగా ఉన్న బీజేపీ.. వారిని ఎక్కడినుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను మేనేజ్‌ చేసుకుంటుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఎలాంటి నిర్ణయాన్ని ఆశించామో దానికి పూర్తిగా విరుద్ధమైన నిర్ణయాన్ని గవర్నర్‌ తీసుకున్నారని విమర్శించారు. ఐపీఎల్‌లో క్రికెటర్లలా.. కర్నాటక ఎమ్మెల్యేలను వేలంలో కొనుక్కునే పరిస్థితికి గవర్నరే నిర్ణయమే కారణమని అన్నారు.

పార్టీలకు సైనికుల్లా గవర్నర్లు మారితే ప్రజాస్వామ్యం నిలవబోదని హెచ్చరించారు. కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ పార్టీకి గుడ్‌బై చెప్పినందుకు తాను సంతోషంగా ఉన్నారని బుధవారం సిన్హా ట్వీట్‌ చేశారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకోలేకపోతే ఢిల్లీలో ఇలాంటి చర్యలకే పూనుకుంటుందని ఆయన చెప్పారు. గవర్నర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..ఇది దేశ రాజకీయ వ్యవస్థ బలహీనత అని, ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం జరగబోదని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు