యడ్డీకి రేపు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు?

యడ్డీకి రేపు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు?

క్యాంపులు వేసినా, కాపు కాసినా కూడా బీజేపీ రాజకీయం ముందు కాంగ్రెస్, జేడీఎస్‌ల రాజకీయం నిలవలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి బలపరీక్షలో నెగ్గేందుకు యడ్యూరప్ప అన్నిఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా కర్ణాటక కాంగ్రెస్ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టేశారని టాక్. ఈ పరిణామాల నేపథ్యంలో జేడీఎస్, కాంగ్రెస్ మధ్య కూడా విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది.

బీజేపీ లింగాయత్‌ అస్త్రాన్ని ప్రయోగించి కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఇలా రాజకీయాన్ని తనవైపు తిప్పుకుంటున్న సమయంలో  కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి మధ్య సఖ్యత కొరవడుతున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ భేటీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టడంతో జేడీఎస్‌ నేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్‌లో కర్ణాటక సీఎల్పీ సమావేశం తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడిన ఆయన తీవ్ర అసంతృప్తితో హోటల్‌ నుంచి నోవాటెల్‌కు వెళ్లిపోయారు. మీ ఎమ్మెల్యేలను మీరే కాపాడుకోలేక పోతున్నారంటూ పెదవి విరిచారని సమాచారం.

కాగా కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 8 మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించేయత్నం చేయడం కారణంగా.. తాజ్‌కృష్ణలో జరిగిన సీఎల్పీ భేటీలో వీరి నుంచి సమావేశంలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు సీఎల్పీ భేటీకి ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గమనార్హం. వీరిలో రాయచూర్‌ జిల్లా మక్కి ఎమ్మెల్యే ప్రతాఫ్‌ గౌడ, బళ్లారి జిల్లా హోస్‌పేట్‌ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ ఉన్నారు. దీంతో బీజేపీ తమ నేతలను ప్రలోభాలకు గురిచేసిందంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 8 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు, 5 గురు డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలను బీజేపీ ఖాతాలో వేసి మొత్తం 117 మందిని లెక్కేస్తున్నారిప్పుడు. దీంతో రేపు యడ్డీ గట్టెక్కేస్తారని చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు