మోడీ గ్రాఫ్ గాలి తీసేసిన యూత్‌

మోడీ గ్రాఫ్ గాలి తీసేసిన యూత్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి, ఆయ‌న్ను న‌మ్ముకున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల‌కు ఇదో షాక్ వంటి ప‌రిణామం. మరో 10 రోజుల్లో నాలుగేళ్లు పూర్తి చేసుకోనున్న ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ఇమేజ్ దారుణంగా ప‌డిపోయింది. ఏకంగా గత రెండేళ్ల‌లో 7 శాతం క్షీణించినట్టు తాజా సర్వేలో వెల్లడైంది.

లోకల్‌ సర్కిల్స్‌ అనే పౌర సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన శాంపిల్‌ సర్వేలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏటేటా స్థిరంగా పెరుగుతోందని వెల్లడైంది. 2016లో ఇదే సంస్థ సర్వే నిర్వహించగా మోడీ పాలన పట్ల 64 శాతంమంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏడాది(2017లో) మోడీ గ్రాఫ్‌ 61 శాతానికి పడిపోయింది. ఇప్పుడు తాజాగా నిర్వహించిన సర్వేలో 57 శాతానికి దిగజారింది. అంటే ఒక్క ఏడాదిలోనే 4 శాతం పడిపోయింది.

ప్ర‌ధానంగా రైతులు, యువ‌త మోడీ ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. గత నాలుగేళ్ల‌ మోడీ పాలనలో నిరుద్యోగ సమస్య తగ్గిందా అంటే 35 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా, 54 శాతంమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 11 శాతంమంది ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. రెండేళ్ల‌ క్రితం 43 శాతం మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేయ‌గా అది మ‌రింత‌కు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. కీల‌క‌మైన వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి ఈ సంస్థ‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడ లేదని 47శాతం మంది చెప్పారు. 37శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరల తగ్గింపు విషయంలో మోడీ ప్రభుత్వ పనితీరుపై 2016లో 55 శాతం అసంతృప్తి వ్యక్తం చేయగా, 2017లో 66శాతం, 2018లో 60శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే రెండేళ్ల‌ క్రితంతో పోలిస్తే అసంతృప్తి 5 శాతం పెరిగిందని అర్థం.

తాజాగా 33శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా, 7శాతం ఏ సమాధా నమూ చెప్పలేదు. మోడీ పాలనలో మహిళలు, చిన్నారులపై హింస తగ్గిందా అన్న ప్రశ్నకు 2016లో 38 శాతం మాత్రమే సానుకూలత వ్యక్తం చేయగా..2017లో 28శాతం, 2018లో 32 శాతం సానుకూలత తెలిపారు. రెండేండ్ల క్రితంతో పోలిస్తే ఈ అంశంలోనూ మోడీ గ్రాఫ్‌ 6 శాతం పడిపోయిందని తేలుతోంది. తాజా స‌ర్వే క‌మ‌ళ‌నాథులు జీర్ణించుకోలేని విధంగా ఉంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English