ప‌వ‌న్ పోరాటం నాకు సంతోషం - విజ‌య‌సాయిరెడ్డి

ప‌వ‌న్ పోరాటం నాకు సంతోషం - విజ‌య‌సాయిరెడ్డి

జ‌న‌సేన పార్టీ అధినేత, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఊహించ‌ని కితాబు ద‌క్కింది. ప‌వ‌న్ బ‌స్సుయాత్ర‌తో రాష్ట్ర వ్యాప్త‌ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయ‌న తిరుమ‌ల‌కు చేరుకొని కాలి న‌డ‌క‌న కొండ ఎక్కారు. త‌మ‌తో క‌లిసి కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న పవన్ సామాన్య భక్తుడిలాగా కలిసి రావడంతో ప‌లువురు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై స్పంది౦చిన పవన్...సామాన్య భ‌క్తుల‌తో క‌లసి స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం త‌న‌కు ఎంతో తృప్తి నిచ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. కాగా, చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకూ బస్సు యాత్రకు పవన్ సిద్ధ‌మ‌వుతుండ‌గా ఊహించ‌ని రీతిలో ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి తీపిక‌బురు వ‌చ్చింది.

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై కదిలిన పవన్ ను అభినందించాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను బస్సు యాత్ర చేపట్టినట్టు పవన్ వెల్లడించార‌ని విజ‌య‌సాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను బస్సు యాత్ర చేపట్టినట్టు పవన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలపై ఎవరు పోరాటం ప్రారంభించినా తనకు సంతోషమేనని, స‌మస్యలకు పరిష్కారం లభిస్తే ఇంకా ఆనందమని వ్యాఖ్యానించారు. కాగా, జ‌గ‌న్ అత్యంత స‌న్నిహితుడ‌నే పేరున్న విజ‌యసాయిరెడ్డి ఈ స్థాయిలో ప‌వ‌న్ యాత్ర‌పై స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉండ‌గా.. ఒక సెలబ్రెటీలా కాకుండా సామాన్య భక్తుడిలా తమతో పాటే దర్శనానికి వచ్చిన పవన్‌ను చూసి భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఉదయం 10 గంటలకు సామాన్య భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.. దర్శనం తర్వాత మహాద్వారం నుంచి బయటకు వచ్చిన జనసేనాని తెల్లని వస్త్రాల్లో ఒక యోగిలా కనిపించారు. శక్తివంచన లేకుండా సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని శ్రీవెంకటేశ్వరుని ప్రార్థించానని.. ఇక్కడే ఉన్న యోగా నరసింహ క్షేత్రంలో తనకు అన్నప్రాసన జరిపారని తన తల్లిదండ్రులు తరచూ చెప్పేవారని ప‌వ‌న్ గుర్తు చేసుకున్నారు.