ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఆర్కేకు క్లోజ్ ఎవ‌రు?

ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో ఆర్కేకు క్లోజ్ ఎవ‌రు?

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటూ వారికి స‌ల‌హాల్ని ఇచ్చే స‌త్తా ఉన్న‌కొంద‌రు ప్ర‌ముఖులు ఉన్నారు. అలాంటి వారిలో మీడియా అధినేత‌గా.. ఆంధ్రజ్యోతి.. ఏబీఎన్ ఛాన‌ల్ య‌జ‌మానిగా సుప‌రిచితులైన వేమూరి రాధాకృష్ణ ఒక‌రుగా చెబుతుంటారు. ఇరువురు చంద్రుళ్ల మ‌ధ్య‌న గ్యాప్ త‌గ్గించ‌టానికి ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో కీల‌క‌భూమిక పోషించార‌ని చెబుతారు.

కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడిగా.. ఆయ‌న్ను ఏక‌వ‌చ‌నంలో పిలిచే చ‌నువు ఉన్న అతి కొద్దిమందిలో ఆర్కే ఒక‌రుగా చెబుతుంటారు. మ‌రి.. అంత చ‌నువు ఉన్న ఇద్ద‌రి మ‌ధ్య‌న గ‌తంలో ఎందుకంత శ‌త్రుత్వం అంటే.. ఇగో నే కార‌ణం అని చెప్పాలి. ఎవ‌రికి వారు త‌మ‌కు తామే గొప్ప‌వాళ్ల‌ని ఫీల్ కావ‌టం.. ఇరువురు ఏ ద‌శ‌లోనూ రాజీ ప‌డ‌క‌పోవ‌టంతో ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకునే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింద‌ని చెబుతారు.

అయితే.. తామిద్ద‌రి మ‌ధ్య‌న వైరం ఇరువురికి న‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని గుర్తించటంతో సంధి చోటు చేసుకుంద‌ని చెబుతారు. దీనిపై గ‌తంలోనే ఆంధ్ర‌జ్యోతి ఎండీ తాను రాసే వ్యాసంలో ఒక‌టికి రెండుసార్లు చెప్పుకున్నారు కూడా. తాము ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని.. సంధి జెండా ఊపింది కేసీఆరేన‌ని ఆయ‌న రాసుకున్నారు. నిజానికి ఈ మాట‌లు రాసినందుకు ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ఫీల్ కావాల్సి ఉంది. కానీ.. ఆర్కేతో స్నేహంతో త‌న‌కు జ‌రిగే లాభంతో పోలిస్తే.. ఈ త‌ర‌హా రాత‌ల‌తో జ‌రిగే న‌ష్ట‌మ‌న్న విషయాన్ని గ్ర‌హించిన కేసీఆర్ చూసీ చూడ‌న‌ట్లుగా ఉంటార‌ని చెబుతారు.

మరింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా.. కీల‌క విష‌యాల్లో స‌ల‌హాలు ఇచ్చే చ‌నువు ఉన్న ఆర్కే.. త‌న ప‌త్రిక‌లో వీకెండ్ వేళ రాసే కాల‌మ్ లో మాత్రం బాబును ఒక మోస్త‌రుగా విమ‌ర్శించ‌టం క‌నిపిస్తుంది. అదే స‌మ‌యంలో కేసీఆర్ లో త‌ప్పుల్ని ఎత్తి చూపే ప‌ని అస‌లు చేయ‌ర‌ని చెబుతారు. ఎందుకిలా అంటే.. రాత‌ల విష‌యంలో కేసీఆర్ రియాక్ష‌న్ ఒక‌లా ఉంటుంద‌ని.. బాబు రియాక్ష‌న్ మ‌రోలా ఉండ‌ట‌మేన‌ని చెబుతారు.

బాబుతో పోలిస్తే కేసీఆర్ చాలా క్షుణ్ణంగా చ‌దువుతార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. చివ‌ర‌కు దిన‌ప‌త్రిక‌ల్లో వేసే ఫోటోల విష‌యంలోనూ ఆయ‌న త‌న అభ్యంత‌రాల్ని మీడియా అధినేత‌ల‌తో నేరుగా ప్ర‌స్తావిస్తార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ తీరుతో పోలిస్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాస్త ప‌ట్టువిడుపుల‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటార‌ని.. మ‌రీ ప‌ట్టుద‌ల‌గా ఉండ‌ర‌ని చెబుతుంటారు.

ఈ కార‌ణంతోనే చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో జ్యోతి రాధాకృష్ణ కాస్తంత స్వేచ్ఛ తీసుకుంటార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అదే స‌మ‌యంలో కేసీఆర్ విష‌యంలో ఆర్కే ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. చిన్న చిన్న ప‌దాల విష‌యంలోనూ కేసీఆర్ అభ్యంత‌రం చెబుతుంటార‌ని.. నొచ్చుకుంటార‌ని చెబుతారు. ఈ కార‌ణంతోనే కేసీఆర్ లోని నెగిటివ్ అంశాల‌పై పెద్ద‌గా విశ్లేష‌ణ ఉండ‌ద‌న్న అభిప్రాయం జ‌ర్న‌లిస్టు స‌ర్కిల్స్ లో వినిపిస్తూ ఉంటుంది. ఏమైనా.ఇద్ద‌రి చంద్రుళ్ల‌తో  ఇంత చ‌నువుగా ఉండే మీడియా  అధినేత ఆర్కేన‌ని  చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు