ప‌రిటాల కుడిభుజం... చ‌మ‌న్ మృతి

ప‌రిటాల కుడిభుజం... చ‌మ‌న్ మృతి

ప‌రిటాల ర‌వి ప్ర‌ధాన అనుచ‌రుడు, తెలుగుదేశం నాయ‌కుడు చ‌మ‌న్ ఈరోజు గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న ఇటీవ‌లి వ‌ర‌కు అనంత‌పురం జెడ్పీ ఛైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ప‌రిటాల ర‌వి కుటుంబానికి చ‌మ‌న్ వెన్నంటే ఉండేవారు. చ‌మ‌న్ మ‌ర‌ణంతో అనంత‌పురం టీడీపీ నేతలు దిగ్బ్రాంతి చెందారు. మ‌రో మూడు రోజుల్లో ప‌రిటాల ర‌వి కుమార్తె స్నేహ‌ల‌త పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఆ ప‌నుల‌న్నీ కూడా చ‌మ‌న్ చూసుకుంటున్నారు. ఇంత‌లోనే ఆయ‌న గుండెపోటుతో అనంతపురంలోని స‌వేరా ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

ప‌రిటాల ర‌వి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించినంత కాలం చ‌మ‌న్ సాహెబ్‌, పోతుల సురేష్ పేర్లు బ‌లంగా వినిపించేవి. ప‌రిటాల ర‌వికి చ‌మ‌న్ కుడి భుజం లాంటి వాడు. దీంతో అప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీలో ప‌రిటాల‌తో పాటు ఉంటూ కీల‌కంగా పార్టీ కోసం ప‌నిచేశారు. అయితే, ప‌రిటాల ర‌వి హ‌త్య అనంత‌రం ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుమారు 8 సంవ‌త్స‌రాలు పాటు అజ్ఞాతంలో గ‌డిపిన ఆయ‌న 2012 లో వెలుగులోకి వ‌చ్చారు. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌లో తెలుగుదేశంలో పునఃప్ర‌వేశం చేసి జిల్లా రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్నారు.

మ‌రో ఏడాది ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ప‌రిటాల రాజ‌కీయాలు బాగా తెలిసిన వ్య‌క్తి అయిన చ‌మ‌న్ చ‌నిపోవ‌డం ప‌రిటాల కుటుంబానికి పెద్ద లోటు. యువ నాయ‌కుడు అయిన ప‌రిటాల శ్రీ‌రామ్‌కు చ‌మ‌న్ అండ‌గా నిలిచి అన్నీ చూసుకుంటాడ‌ని గుండె మీద చేయివేసుకుని హాయిగా ఉన్న ప‌రిటాల కుటుంబం అత‌ని మ‌ర‌ణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు