గోవా సీఎం ఆఫీసు ఇపుడు అమెరికాలో!

గోవా సీఎం ఆఫీసు ఇపుడు అమెరికాలో!

`మ‌న‌దేశంలోని ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అమెరికా నుంచి ప‌రిపాల‌న చేస్తున్నారు. ఇలా ఒక రోజు కాదు ఏకంగా ఆరు వారాలపాటు ఈ పాల‌న కొన‌సాగుతోంది. ఆయ‌న ఎవ‌రంటే...గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్` అంటూ కొద్దిరోజుల క్రితం సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. 62 ఏళ్ల పారికర్ కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ ఫిబ్ర‌వ‌రి15వ తేదీన ఆయన ముంబై హాస్పటల్‌లో చేరారు. ముంబైలోని లీలావతి హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన పనాజీ చేరుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం కొన్ని రోజుల‌కు ఆయ‌నకు ఆరోగ్య స‌మ‌స్య‌లు మ‌ళ్లీ ఎదుర‌య్యాయి, దీంతో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు వెళ్లే ముందు ఆయ‌న త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల్లో ఎవ‌రికీ బాధ్యత‌లు అప్ప‌గించ‌లేదు. దీంతో అలా వార్త‌ల్లో నిలిచిన పారిక‌ర్ ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న న్యూస్‌తో తెర‌పైకి వ‌చ్చారు. అదే ఆస్ప‌త్రి నుంచే న‌వ‌త‌రానికి హిత‌బోధ చేయ‌డం.

అమెరికాలో చికిత్స పొందుతున్న మనోహర్ పారికర్ రాసిన లేఖ అంటూ ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘ఈ జీవితం నాకు అపారమైన రాజకీయ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మొదట్లో పేరు, పదవి, సంపదే మైలురాళ్లు అని భావించేవాడిని. మరణానికి దగ్గరగా ఉన్న ఈ నిమిషంలో అవి అర్థరహితమని అనిపిస్తున్నాయి. డబ్బు, పేరు కంటే సామాజిక సేవ, ఇతరులతో సత్సంబంధాలే ప్రధానం. నా రాజకీయ ఘనతలేమీ ఇప్పుడు నాతో రావని నాకు ఇప్పుడే తెలుస్తోంది. నేనిప్పుడున్న స్థితిని నేను తప్ప వేరొకరు అనుభవించేది కాదు. జీవితమనే రంగస్థలంలో చివరి అంకానికి చేరుకుంటామనే వాస్తవాన్ని అందరం ఏదో సందర్భంలో తెలుసుకుంటాం. అందుకే.. ఈ జీవితం తర్వాత ఏంటి అనేది నేర్చుకోవాలి. ఇతరుల మంచిచెడ్డలు చూసుకోవాలి. ఇతరులకు డబ్బు ఖర్చుపెట్టాలి. బతికున్నంతకాలం జీవితాన్ని ఆస్వాదించాలి’ అని ఆ లేఖలో ఉంది.

సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గానే కాకుండా పార్టీల‌కు అతీతంగా అభిమానుల‌ను క‌లిగి ఉన్న  పారిక‌ర్ ఆస్ప‌త్రిలో ఉండి ఇలాంటి లేఖ రాయ‌డంపై ఆస‌క్తి నెల‌కొంది.అయితే వైరల్‌గా మారిన  వైరాగ్యంతో కూడిన ఆ లేఖ రాసింది పారికర్‌ కాదంటూ సీఎం కార్యాలయ వర్గాలు చెబుతుండగా ఆయనే రాశారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మ‌రోవైపు ఆయ‌న ఆరోగ్యం గురించి స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఏదీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ పోస్ట్ ఆయ‌నే రాసి ఉంటార‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు