అఖిలేష్ హైద‌రాబాద్ టూర్‌..ఆ టీడీపీ నేత‌తో ప్ర‌త్యేక భేటీ

అఖిలేష్ హైద‌రాబాద్ టూర్‌..ఆ టీడీపీ నేత‌తో ప్ర‌త్యేక భేటీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌కు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు  ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఘనస్వాగతం పలికారు.

ఆయనకు స్వాగతం పలికేందుకు యాదవ, కురుమసంఘాలు, టీఆర్ఎస్ నేతలు, సమాజ్‌వాదీపార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. అనంత‌రం ఆయ‌న కేసీఆర్‌తో భేటీ అయి తిరిగి త‌మ స్వ‌రాష్ర్టానికి వెళ్లిపోయారు. అయితే ఈ టూర్‌లో ఆయ‌న ఓ టీడీపీ ప్ర‌ముఖుడితో భేటీ అయ్యారు. ఆయ‌న ఎవ‌రంటే..టీడీపీ మైదుకూరు ఇంచార్జీ, ఇటీవ‌లే టీటీడీ చైర్మ‌న్‌గా ఎన్నిక‌యిన పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్‌.

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉండి గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫునే పోటీ చేసిన‌ప్ప‌టికీ ఎమ్మెల్యేగా నెగ్గిన అనంత‌రం టీఆర్ఎస్‌లో చేరి మంత్రి ప‌ద‌వి సంపాదించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వియ్యంకుడు అనే సంగ‌తి తెలిసిందే. అందుకే ఆయ‌న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ టూర్‌లో ప్రత్య‌క్ష‌మ‌య్యారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం అఖిలేశ్‌యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు.

మంత్రి కేటీఆర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి అఖిలేశ్‌యాదవ్ సాయంత్రం 6:25 గంటలకు మంత్రి తలసాని నివాసానికి చేరుకున్నారు. ఇటీవల టీటీడీబోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పుట్టా సుధాకర్ యాదవ్.. అఖిలేశ్‌యాదవ్‌తోపాటు, మంత్రి కేటీఆర్‌కు వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్‌యాదవ్ అఖిలేశ్‌కు తలపాగాను అలంకరించి, ఖడ్గం బహూకరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు