ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ: పవన్

ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ: పవన్

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఎన్నిక‌ల విష‌యంలో తాను ఎంత సీరియ‌స్‌గా ఉన్నానో వెల్ల‌డిస్తూ ఈ క్ర‌మంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య రాజకీయ వ్యూహకర్త శ్రీ దేవ్ గారిని పరిచయం చేశారు. ఎన్నికల ప్రణాళికలు, సంస్థాగత నిర్మాణపరమైన విధానాల రూపకల్పనకు దేవ్ పార్టీతో ఉంటారనీ, గత పది నెలలుగా జనసేనకు పని చేస్తున్నారు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి పార్టీ సర్వ సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. పక్కాగా రూపొందిస్తున్న ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేద్దామని స్పష్టం చేశారు. "పార్టీకి అనుభవం లేదు అనే మాట ప్రత్యర్ధులు అంటారుగానీ... జనసేనకు పార్టీగా అనుభవం లేకపోవచ్చు... పార్టీలోని ప్రతి కార్యకర్తకీ రెండు ఎన్నికల్లో క్రియాశీలంగా ఉన్న అనుభవం ఉంది అని చెప్పండి` అంటూ త‌న పార్టీ నాయ‌కుల‌కు హిత‌బోధ చేశారు.

"జనసేన పార్టీకి మనది తొలి తరం. అందరం మధ్యతరగతి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మన పార్టీకి లక్షల మంది అన్ని ఊళ్లలో ఉన్నారు. క్రమశిక్షణతో, బలమైన భావజాలంతో జనసేన నిర్మితమవుతోంది. కొద్దిమంది చేతుల్లో, కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయాలు ఉండిపోవడంతో అభివృద్ధి, వాటి ఫలాలు ఆందరికీ చేరడం లేదు, అందరికీ న్యాయం జరగడం లేదు. సగటు మనిషి... అణగారిన వర్గాల బలమైన గొంతు మన జనసేన పార్టీ.  "

మొత్తం సీట్ల‌లో ఎందుకు పోటీ చేయాల‌నుకున్నానో ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివ‌రించారు. `గత ఎన్నికల్లో 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నాను. తర్వాతి పరిస్థితుల్లో ఎన్డీఏ కు సహకరించాం. ఒక ఎమ్మెల్యేగాగా పోటీ చేసేముందు క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపై అవగాహన అవసరం అనేది నా ఉద్దేశం. అవేవి లేకుండా పోటీ చేసి గెలిస్తే, ఎప్పటికీ నేర్చుకొనే అవకాశం ఉండదు. గిరిగీసుకొని కూర్చొని, సంప్రదాయ విధానాల్లో రాజకీయాలు చేసేవారికి మన జనసేన పంథా అర్థం కాదు. పార్టీ సిద్దాంతాలను ఎంతో లోతుగా అధ్యయనం చేసి రూపొందించాం. కులాల ఐక్యత అనేది మన తొలి సిద్దాంతం. ఒక కులానికి ఒక కులం పరస్పర ఆధారంగా నిలవాలి. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదు. కులం అనే భావనే ఉంటే తెలుగుదేశం పార్టీకి ఎలా సహకరిస్తాం?` అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. కులాలకు అతీతంగా ఆలోచన చేద్దామ‌ని పవ‌న్ వెల్ల‌డించారు.
 
"కుల, మత సామరస్యం కాపాడటం ముఖ్యం అని నమ్మే పార్టీ జనసేన. ఈ పార్టీ ప్రతిభావంతులైన కార్యకర్తలకి వేదికగా నిలిచేలా చేస్తున్నాం. బలమైన మేధస్సుతో కూడిన కార్యకర్తలున్నారు. ఇది ఓ కుటుంబం, కులానికి సంబంధించిన పార్టీ కాదు. ఎన్నికల్లోకి వెళ్ళేందుకు, ఎన్నికల సమయంలో అనుసరించే విధివిధానాలకి మన పార్టీకి ప్రొఫెషనల్ సహకారం అవసరం ఉంది. అందుకే దేవ్ గారిని ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా తీసుకున్నాం. ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తరవాత వారి సేవల్ని వినియోగించుకుంటాం" అని వెల్ల‌డించారు. కాగా, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రీతిలోనే జ‌న‌సేన పార్టీ అధినేత రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకున్న నేప‌థ్యంలో ఆయ‌న అడుగులు ఏ విధంగా ఉండ‌నున్నాయో అనే ఆస‌క్తి నెల‌కొంది.

జనసేన కొద్ది స్థానాల్లోనే పోటీ చేస్తుందని ఎప్పుడూ చెప్పలేదని ప‌వ‌న్ వెల్ల‌డించారు. `ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీపీఎఫ్‌) ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు,  దేవ్ టీం కలసి ఎన్నికల ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు. 1200 మంది సిపిఎఫ్ కార్యకర్తలు దేవ్ కు సహకరిస్తారు. 350 మందితో దేవ్ టీమ్ ఉంటుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు ఎలా ముందుకు వెళ్లాలో బలమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. మరో వైపు తెలంగాణకి సంబంధించి క్యాడర్ ను బలోపేతం చేస్తున్నాం. ఆగస్ట్ రెండో వారం నాటికి తెలంగాణలో పోటీకి సంబంధించి ప్రాధమిక ప్రణాళిక ప్రకటిస్తాం` అని వెల్ల‌డించారు. త్వరలో ప్రజల మధ్యలోకి వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. `ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలను తెలియపరచేలా ప్రజల మధ్యలోకి వెళదాం. ఈ నెల 11 వ తేదీలోగా ఈ పర్యటనలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను. ఏ ఊరు నుంచి ఈ యాత్ర ఉండేది అప్పుడు చెబుతాను. ప్రకటించిన 48 గంటల్లోగా ప్రజల మధ్యలో ఉంటాను`` అన్నారు.

జనసేన ముఖ్య రాజకీయ వ్యూహకర్త దేవ్ ముఖ్య కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడుతూ "జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలసిన అనుభవం ఉంది. ఈ రంగంలో దశాబ్దకాలంగా ఉన్నాను. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయే సీజన్‌ పొలిటీషియన్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి ప్రజా సమస్యలపట్ల, సామాజికాంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. జనసేన పార్టీకి బలమైన భావజాలాన్ని, సిద్దాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్ స్థాయి నుంచి పకడ్బంది ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్ కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా ఉత్తేజితులై అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్దాంతాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే అంశాలతోపాటు ఎన్నికల వరకూ అనుసరించే వ్యూహాల్ని మీతో ఎప్పటికప్పుడు పంచుకొంటాను. జనసేన  ప్రజలతో మమేకమయ్యే పార్టీ. అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం" అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు