అది మోడీ చేసిన బిగ్ మిస్టేక్ !

అది మోడీ చేసిన బిగ్ మిస్టేక్ !

ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్ మ‌రోమారు బీజేపీపై మండిప‌డ్డారు. గ‌త కొద్దికాలంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ పార్టీపై మండిప‌డుతున్న ప్ర‌కాశ్ రాజ్ క‌న్న‌డ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో సంచ‌ల‌న జోస్యం చెప్పారు. ద వైర్‌ అనే వెబ్‌సైట్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మళ్ళీ ప్రధాని కాలేరని అన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలోకి రాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక, ఉడిపి ప్రాంతాల్లో మతం ఆధారిత రాజకీయాలతో ప్రవేశించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని…. అయిదేళ్ళ క్రితం అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ ఏం చేసిందో జనం మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన కోరారు. బీజేపీ నేతృత్వంలో ముగ్గురు సీఎంలు మారారని, అనేక అవినీతి ఆరోపణలకు అప్పటి ప్రభుత్వం ఎదుర్కొందని వెల్లడించారు.

మైనింగ్‌ డాన్‌ గాలి జనార్ధన రెడ్డి సోదరుల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంపై ప్రకాష్‌ రాజ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గాలి జనార్ధన రెడ్డిని క్షమాభిక్ష ప్రసాదించినట్లు మాజీ సీఎం యడ్యూరప్ప అనడంపై ప్రకాష్‌ రాజ్‌ కామెంట్ చేస్తూ.. క్షమించడానికి యడ్యూరప్ప ఎవరని ప్రశ్నించారు. కోట్ల విలువ చేసే సంపదను దోచుకున్నవారిని క్షమించాల్సింది కర్ణాటక ప్రజలే కాని యడ్యూరప్ప కాదన్నారు. గాలి జనార్ధన్‌ రెడ్డి గ్రూప్‌కు టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌ షా లోపాయికారిగా తతంగాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమిత్‌ షా అండర్‌ గ్రౌండ్‌ మాఫియా నడిపిస్తున్నారా అని ప్రకాష్‌ రాజ్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య ప్రభుత్వం బాగానే పనిచేస్తోందని ప్ర‌కాశ్ రాజ్ కితాబిచ్చారు. ఆయన ఏమీ చేయలేదని అనే పరిస్థితి లేదన్నారు. అయితే రాబోయే ఎన్నిక‌ల్లో ప్రజలదే తుదినిర్ణయమని ప్రకాష్‌ రాజ్‌ వివరించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినందున కొన్ని ప్రకటనలు తనకు రాకుండా అధికార పక్షం అడ్డుకుందని ప్ర‌కాశ్ రాజ్ ఆరోపించారు. అలాగే కొన్ని హిందీ సినిమా అవకాశాలు కూడా పోయాయని ప్రకాష్‌ రాజ్ మండిప‌డ్డారు. దాని వల్ల తనకు వచ్చే నష్టమేమీ లేదని.. ఆ మాత్రం నష్టాన్ని భరించే ఆర్థిక స్తోమత తనకు ఉందని అన్నారు. అయితే బీజేపీ భక్తులు తన దక్షిణాది సినిమాల జోలికి రాలేరని అన్నారు. దమ్ముంటే వచ్చి ఆపాలని సవాల్‌ విసిరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English