షాక్ఃట్విట్టర్‌ కూడా డాటాను అమ్ముకుంది!

షాక్ఃట్విట్టర్‌ కూడా డాటాను అమ్ముకుంది!

నెటిజ‌న్ల‌కు మ‌రో దుర్వార్త‌.  ఫేస్‌బుక్‌ తరువాత మరో ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ కూడా డాటా కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. ట్విట్టర్‌ కూడా తమ వినియోగదారులకు సంబంధించిన వివరాలను బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాకు అమ్ముకున్నట్టు ది సండే టెలిగ్రాఫ్‌ పత్రిక బయటపెట్టింది. బ్రిటిష్‌ రాజకీయ సంప్రదింపుల సంస్థగా ఉన్న కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ఫేస్‌బుక్‌కు చెందిన 8.7 కోట్ల మంది వినియోగదారుల వివరాలను వారి అనుమతి లేకుండానే సేకరించిన సంగతి ఇటీవలే బయటపడటం తెలిసిందే. ట్విట్టర్‌ కూడా కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా సంస్థ నుంచి కొంత డబ్బు తీసుకొని తమ వినియోగదారుల వివరాలను అందజేసినట్టు బయటపడింది. ఓటర్లను లక్ష్యంగా చేసుకొని వారి మానసిక స్థితిపై ప్రభావం చూపే డాటాను కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా సంస్థ కోసం రూపొందించిన అలెగ్జాండర్‌ కోగన్‌ అనే నిపుణుడు ట్విట్టర్‌ నుంచి 2015లో వినియెగదారుల వివరాలను తస్కరించినట్టు ఆ పత్రిక వివరించింది.

కోగన్‌ స్థాపించిన గ్లోబల్‌ సైన్స్‌ రిసెర్చ్‌ (జీఎస్‌ఆర్‌) అనే సంస్థకు ట్విట్టర్‌ డాటా అందుబాటులో ఉండేది. ట్విట్టర్‌ నుంచి సేకరించిన సమాచారంతో ‘బ్రాండ్‌ రిపోర్టులు’, ‘సర్వే నమూనాలు’ మాత్రమే రూపొందించామని, నిబంధనలు ఉల్లంఘించలేదని కోగన్‌ చెప్పారు. కోగన్‌ తన జీఎస్‌ఆర్‌ ద్వారా 2014 డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ 2015 వరకు ట్విట్టర్‌లోని ట్వీట్లను, యూజర్ల పేర్లను, ఫొటోలను, ప్రొఫైల్‌ చిత్రాలను సేకరించినట్టు టెలిగ్రాఫ్‌ పత్రిక తెలిపింది. ట్విట్టర్‌లోని ట్వీట్లన్నీ బహిరంగమే అయినప్పటికీ, వాటిని మూకుమ్మడిగా సేకరించే సంస్థల నుండి ట్విట్టర్‌ సంస్థ డబ్బు వసూలు చేస్తుంది. ట్విట్టర్‌ నుండి సున్నితమైన రాజకీయ సమాచారాన్ని సేకరించకుండా నిషేధం విధించినప్పటికీ ఆయా సంస్థలు సామూహికంగా సేకరించిన వివరాల నుంచి ఒక అంశానికి సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని లేక వారి ఆలోచనలను అంచనా వేస్తాయి. ట్విట్టర్‌ను తాము రాజకీయ ప్రకటనల కోసం ఉపయోగించుకున్నామని, కానీ జీఎస్‌ఆర్‌తో కలిసి ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ప్రతినిధి చెప్పారు. జీఎస్‌ఆర్‌ నుంచి తాము ట్విట్టర్‌ డాటాను ఎప్పుడూ తీసుకోలేదని, తాము రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసేలా ఎప్పుడూ ప్రయత్నించలేదని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English