సీఎం పిలుపు.. నిరుద్యోగులారా పాన్‌డ‌బ్బాలు పెట్టుకోండి

సీఎం పిలుపు.. నిరుద్యోగులారా పాన్‌డ‌బ్బాలు పెట్టుకోండి

బీజేపీ నేత, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ వివాదాస్ప‌ద కామెంట్ల‌కు బ్రేక్ ప‌డ‌టం లేదు. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా ఆయ‌న కామెం్ట‌లు ర‌చ్చ రచ్చ‌గా మారుతున్న‌ప్ప‌టికీ...బిప్ల‌బ్ అదే తీరును కొన‌సాగిస్తున్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉన్నదని, డయానా హెడెన్‌ను ప్రపంచ సుందరిగా ఎలా ఎన్నుకున్నారో అని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి అటువంటి మాటలే మాట్లాడారు.

ఈ ద‌ఫా ఆయ‌న నిరుద్యోగుల‌ను కెలికారు. చదువుకున్న యువత ఉపాధినిమిత్తం పాన్‌షాపులు పెట్టుకోవాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో బిప్లబ్‌ దేబ్‌ తాజాగా వ్యాఖ్యానించారు. పాన్‌ షాప్‌ పెట్టుకోవడం కుదరకపోతే ఆవులను పోషిస్తూ పాల వ్యాపారం చేసుకోవాలని కోరారు.

త్రిపుర వెటర్న‌రీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి కుటుంబం ఓ ఆవును పోషించాలని అన్నారు. నిరుద్యోగులుగా సమయాన్ని వృథా చేయడం బదులు పాలను అమ్ము కుంటే బాగుంటుందని నిరుద్యోగ యువతకు సూచించారు. సంకుచిత ఆలోచనలతో గ్రాడ్యుయేట్లు వ్యవసాయం, పాలవ్యాపారాన్ని చేయటం లేదని, అందువల్లే నిరుద్యోగం పెరుగుతోందని అన్నారు.

కాగా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్నిఇస్తామని త్రిపుర అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ.. అధికారంలోకి రాగానే ఆ హామీని విస్మరించిందని, పైగా పాన్ డ‌బ్బాలు పెట్టుకోవాల‌ని ఉచిత స‌ల‌హా ఇస్తోంద‌ని విప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పించడంలో విఫలమైందని విమర్శను వ్యతిరేకిస్తూ..పకోడాలు అమ్ముకునేవారు కూడా ఉద్యోగులేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం, దానికి కొన‌సాగింపుగా పాన్ డ‌బ్బాలు పెట్టుకోవాల‌ని సీఎం సూచించ‌డం బీజేపీ ద్వంద్వం విధానానికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు.