బాబు, జ‌గ‌న్‌ ను ఫాలో అవుతున్న మోడీ

బాబు, జ‌గ‌న్‌ ను ఫాలో అవుతున్న  మోడీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అత్య‌ల్ప కాలంలో బీజేపీ అత్యున్న‌త స్థానానికి ఎదిగిన సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్ రాజ‌కీయాల‌ను గ‌మ‌నించిన వారికి మోడీ సీఎం కుర్చీపై కూర్చోవ‌డం ఊహించ‌ని ప‌రిణామ‌మే. ఇక ప్ర‌ధాని పీఠంపై అయితే... బీజేపీలోని ఎంద‌రో సీనియ‌ర్ల‌కు, పార్టీ నేత‌ల‌కు ఏమాత్రం మింగుడు ప‌డ‌ని అంశం. అయితే ఈ స్థానానికి ఎదిగేందుకు మోడీ ఎంత‌గానో శ్ర‌మించార‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే మోడీ అక్క‌డితోనే ఆగిపోలేదు. ఆ త‌ర్వాత కూడా...త‌న ప్ర‌త్యేక ల‌క్ష‌ణాల‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌ధాని అయిన త‌ర్వాత కూడా త‌న అనుకూలురు..వ్య‌తిరేకులు...క‌లిసి వ‌చ్చేవారు...ఇలా అంద‌రిపై ఓ క‌న్నేసి ఉంచుతున్నారు.

ఇలా మోడీ ఓ న‌జ‌ర్ వేసింది ఎక్క‌డంటే...ఆయ‌న‌కు ఎంతో న‌చ్చిన సోష‌ల్ మీడియాలో. ఎందుకంటే..ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్లోలో ఆయ‌న ఏపీకి చెందిన ముఖ్యుల‌ను ఫాలో అవుతున్నారు. ఆ ముఖ్యులే..ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. ఈ ఇద్ద‌రూ ప్ర‌ముఖులూ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రినీ ప్ర‌ధాని మోడీ త‌న వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఫాలో అవుతున్నారు. అదే స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌ల్లో ఏ ఒక్క‌రు కూడా..మోడీని ఆయ‌న వ్య‌క్తిగ‌త అకౌంట్లో ఫాలో అవ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాన‌మంత్రిని ఈ ఇద్ద‌రు నేత‌లు లైట్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ...ప్రాంతీయ పార్టీకి చెందిన నేత‌ల‌ను మాత్రం మోడీ ఓ కంట క‌నిపెడుతున్నార‌ని అంటున్నారు.

ఇదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఫాలో అవుతున్న వారి వివ‌రాలు ఆస‌క్తికరంగా ఉన్నాయి. జ‌గ‌న్ ఏడుగురిని ఫాలో అవుతుంటే అందులో ఐదుగురు జ‌ర్న‌లిస్టులు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌టి త‌న పార్టీ అకౌంట్ కాగా, మ‌రొక‌టి అంత‌ర్జాతీయ మీడియా అయిన బీబీసీ. ఇక చంద్ర‌బాబు ఇద్ద‌రిని ఫాలో అవుతుంటే...అందులో ఒక‌టి ఆయ‌న అధికారిక అకౌంట్ అయిన‌ ఏపీ సీఎం ట్విట‌ర్ హ్యాండిల్‌. మ‌రొక‌టి క‌లాం సెంట‌ర్ అకౌంట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు చెందిన ట్విట్ట‌ర్ వాడ‌కం తీరు నెటిజ‌న్ల‌కు కొత్త ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు