గాలి సీటు ఆమెకు ఇచ్చేసిన బాబు!

గాలి సీటు ఆమెకు ఇచ్చేసిన బాబు!

సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌.. చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌ను చూపిన గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌టం తెలిసిందే. ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న మ‌ర‌ణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఏదైనా ప‌ద‌విలో ఉన్న నేత మ‌ర‌ణిస్తే.. ఆ చోట జ‌రిగే ఎన్నిక‌ల్లో స‌ద‌రు నేత కుటుంబ స‌భ్యులు రంగంలోకి దిగితే.. అక్క‌డ పోటీ చేయ‌కుండా ఉంటోంది. ఈ  విష‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ మొద‌ట్నించి ఒకే విధానాన్ని అనుస‌రిస్తోంది.

తాజాగా గాలి విష‌యంలోనూ ఆ ధ‌ర్మాన్నే పాటిస్తోంది. గాలి మ‌ర‌ణం నేప‌థ్యంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌రిలోకి దిగేది లేద‌ని ప్ర‌క‌టించింది. ఇక‌.. గాలి రాజ‌కీయ వార‌సులుగా ఆయ‌న ఇద్ద‌రు కొడుకుల్లో ఒక‌రు అని నిర్ణ‌యించుకొని త‌న వ‌ద్ద‌కు వ‌స్తే.. వారి విష‌యం గురించి ఆలోచిస్తాన‌ని టీడీపీ అధినేత.. ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్ప‌టం తెలిసిందే.

సుదీర్ఘ మంత‌నాల అనంత‌రం.. గాలి కొడుకులు వెన‌క్కి త‌గ్గి.. త‌న తండ్రి రాజ‌కీయ స్థానాన్ని త‌మ త‌ల్లి స‌ర‌స్వ‌తమ్మ‌కు క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబుకు చెప్ప‌టం.. ఆయ‌న వెంట‌నే ఆమోదించి.. గాలి స్థానంలో స‌రస్వ‌తమ్మ‌ను ప్ర‌క‌టించారు. గ‌తంలో తాము అనుస‌రించిన ఆన‌వాయితీనే తాజాగా అమ‌లు చేస్తున్న‌ట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమ‌న క‌రుణాక‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. కుటుంబ స‌భ్యులంతా ఏకాభిప్రాయానికి వ‌చ్చి ఎమ్మెల్సీ ప‌ద‌విని త‌మ త‌ల్లికి క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యించ‌టంతో బాబు ఆ దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం గాలి ఇద్ద‌రు కుమారులు.. త‌మ తండ్రి ఎమ్మెల్సీ ప‌ద‌విని త‌మ‌కే క‌ట్ట‌బెట్టాల‌ని ఒక‌రికి పోటీగా మ‌రొక‌రు ప్ర‌య‌త్నాలు చేయ‌టంతో.. మ‌ధ్యేమార్గంగా గాలి స‌తీమ‌ణిని తెర మీద‌కు  తీసుకొచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు