సోష‌ల్ మీడియా- నోరు జారితే సీఎం అయినా సారీ చెప్పాల్సిందే!

సోష‌ల్ మీడియా- నోరు జారితే సీఎం అయినా సారీ చెప్పాల్సిందే!

పార్టీ  ప్ర‌జాప్ర‌తినిధులు, నేతలు బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయరాదని ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ స్ప‌ష్టంగా హెచ్చరించినా.. బీజేపీ నేతలు మాత్రం తమ నోరును అదుపులో పెట్టుకోవడం లేదు. త‌మ‌కు న‌చ్చిన కామెంట్లు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనంత‌రం బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్తున్నారు. ఇలా వివాదంలో చిక్కుకుంటున్న వారి జాబితాలో త్రిపుర సీఎం బిప్లబ్‌కుమార్‌దేబ్ చేరారు.

నిన్న‌ అగర్తలలో జరిగిన హ్యాండ్లూమ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ మిస్ వరల్డ్ డయానా హెడన్ భారతీయ మహిళ కాదని కానీ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మాత్రం భారతీయురాలే అని అన్నారు. `ఐశ్వర్యరాయ్, ప్రియాంకచోప్రా వంటి వారికి ప్రపంచ సుందరి కిరీటం రావడం బాగానే ఉంది. కానీ డయానా హెడెన్‌కు ఎలా వచ్చిందో తెలియదు` అని అన్నారు.

తెల్లగా లేకున్నా ఆమె ప్రపంచ సుందరిగా ఎలా ఎంపికయ్యారో అని తన శరీర రంగును విమర్శించిన త్రిపుర సీఎం బిప్లబ్‌కుమార్‌దేబ్‌పై హైదరాబాద్‌కు చెందిన మాజీ ప్రపంచ సుందరి డ‌యానా స్పందించారు. `గోధుమవర్ణంలో ఉండే భారతీయుల అందచందాల్ని ప్రపంచం ఆదరించి ప్రపంచసుందరి కిరీటాల్ని అందించి గౌరవించినా, కొందరు భారతీయులకే ఈ సంగతి నచ్చకపోవడం సిగ్గుచేటు, బాధాకరం` అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనది గోధుమవర్ణం కావడంతో త్రిపుర సీఎం తనను చులకన చేస్తూ మాట్లాడినట్లు హెడెన్ పేర్కొన్నారు.
భారతీయుల్లో అత్యధికులు గోధుమవర్ణంలోనే ఉంటారని, తెల్లతోలుకే విలువనిచ్చే త్రిపుర సీఎం వంటి వారి ఆలోచనా ధోరణిపై తాను పోరాడుతున్నానని తెలిపారు.

ఇంత‌కుమునుపు ప్రింట్ ఎడిష‌న్లు రాజ్య‌మేలిన కాలంలో నాయ‌కులు మాట్లాడిన దానిపై జ‌నం ఏమ‌నుకుంటారో తెలిసేది కాదు. దీంతో జ‌నం రెస్పాన్సు తెలియ‌క నాయ‌కులు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడినా ఏమ‌య్యేది కాదు. ఇపుడు సోష‌ల్ మీడియా ఎవరినీ వ‌ద‌ల‌డం లేదు. నోరు జారిన అంద‌రితో సారీ చెప్పిస్తోంది. చివ‌ర‌కు తన వ్యాఖ్యలపై సీఎం బిప్లబ్‌దేబ్ క్షమాపణ చెప్ప‌క త‌ప్ప‌లేదు. చేనేత వస్తువుల మార్కెటింగ్ బాగుండాలన్న అర్థంలోనే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇస్తూ ఆమెకు సారీ చెప్పారు. చేనేత పరిశ్రమ బాగా మార్కెట్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో తాను మాట్లాడానని, తన వ్యాఖ్యలు బాధించినా, ప్రతిష్ఠకు భంగం కలిగించినా అందుకు క్షంతవ్యుడనని, తన అమ్మను గౌరవించినట్లే మహిళలందర్నీ నేను గౌరవిస్తానని చెప్పారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు