ఆ సీఎం కెల‌క్కుండా ఉండ‌లేరా?

ఆ సీఎం కెల‌క్కుండా ఉండ‌లేరా?

తాము కూర్చున్న కుర్చీ విలువ కొంద‌రికి తెలీదు. ఒక‌వేళ తెలిస్తే.. ఆచితూచి మాట్లాడ‌తారే త‌ప్పించి.. తొంద‌ర‌ప‌డ‌రు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉండొద్ద‌ని ప్ర‌ధాని మోడీ చెప్పినా.. బీజేపీ నేత‌ల్లో కొంద‌రు మాత్రం ఆ మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. ఈ మ‌ధ్య‌నే త్రిపుర ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు స్వీక‌రించిన విప్ల‌వ్ కుమార్‌.. త‌ర‌చూ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడాయ‌న‌కు స‌రికొత్త ఇమేజ్ ను తీసుకొచ్చి పెడుతున్నాయి.

బీజేపీ ముఖ్య‌మంత్రుల్లో ఆయ‌న మాదిరి కెలికి మ‌రీ తిట్టించుకునే మొన‌గాడు మ‌రెవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా ఉంది ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి. వివాదాల‌కు ఎంత ద‌గ్గ‌ర‌గా ఉండాలో ఆయ‌న్ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంటుంది. ఈ మ‌ధ్య‌న ఇంట‌ర్నెట్‌.. శాటిలైట్ వ్య‌వ‌స్థ‌ల‌పై త‌న‌దైన శైలిలో మాట్లాడి అంద‌రి నోట్లో నానిన ఆయ‌న.. ఆ విమ‌ర్శ‌లు ఒక కొలిక్కి రాక‌ముందే.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై మాట్లాడిన రాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మ‌య్యారు.

మ‌మ‌త‌కు మ‌తి చెడిందంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అందాల పోటీపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అసంబ‌ద్ధంగా ఉండ‌ట‌మే కాదు.. అన‌వ‌స‌ర వివాదాల్ని నెత్తిన వేసుకుంటున్న చందంగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అందాల పోటీపై త్రిపుర ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేప‌టం ఖాయ‌మంటున్నారు. చేనేత‌.. హ‌స్త క‌ళాకృత‌ల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీఎం విప్ల‌వ్‌.. ఆ సంద‌ర్భంగా మాట్లాడారు. విదేశీ వ‌స్త్ర వ్యాపారులు అందాల పోటీల నిర్వ‌హణ పేరుతో త‌మ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల‌ను మార్కెట్ చేసుకుంటార‌న్న ఆయ‌న‌.. అందాల పోటీల్లో విజేత‌ల్ని ముందుగానే డిసైడ్ చేస్తార‌ని వ్యాఖ్యానించారు.

ఏ దేశ వ‌స్త్రాల్ని.. సౌంద‌ర్య సాధ‌నాల్ని ప్ర‌చారం చేసుకోవాల‌ని భావిస్తారో.. ఆ దేశానికి చెందిన వారినే విజేత‌లుగా ప్ర‌క‌టిస్తార‌న్నారు.  గ‌త కొన్ని సంవ‌త్స‌రాల్లో భార‌తీయ మ‌హిళ‌లు అందాల పోటీల్లో గెలుస్తున్నార‌న్న ఆయ‌న‌.. ఐశ్వ‌ర్యా రాయ్ గెలుపొంద‌టంలో అర్హ‌త ఉంది. కానీ.. డ‌యానా హెడెన్ ఎవ‌రు?  ఎవ‌రికి ప్ర‌తినిధిగా ఆమె ఈ పోటీల్లో పాల్గొంది?. నిర్వాహ‌కుల‌కు ఆమెలో ఏం అందం క‌నిపించిందో నాకైతే అర్థం కాలేదు.. ఇదంతా అంత‌ర్జాతీయ వ‌స్త్ర వ్యాపారుల మాఫియా అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

విప్ల‌వ్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేప‌ట‌మే కాదు.. ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ఒక పిచ్చివాడి మాట‌లుగా ఉన్నాయంటూ ప‌లువురు తిట్టిపోస్తున్నారు. గ‌తంలో భార‌తీయ మ‌హిళ‌లు ఎలాంటి సౌంద‌ర్య సాధ‌నాలు వాడ‌కుండా స్నానం చేయ‌టానికి మ‌ట్టిని.. త‌ల‌ను శుభ్రం చేసుకోవ‌టానికి మెంతులు వాడేవార‌ని.. ఎప్పుడైతే విదేశీ వ‌స్త్ర వ్యాపారాలు త‌మ ఉత్ప‌త్తుల్ని దేశంలో మార్కెట్ చేయ‌టం మొద‌లెట్టారో.. అప్ప‌టి నుంచి సౌంద‌ర్య సాధ‌నాల వినియోగం పెరిగిపోయింద‌న్నారు. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసి వివాదాలు నెత్తిన ఎలా వేసుకోవాలో త్రిపుర సీఎంను చూసి ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు