ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా చూసిన వారిద్ద‌రి షేక్ హ్యాండ్‌!

ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా చూసిన వారిద్ద‌రి షేక్ హ్యాండ్‌!

ఉత్త‌ర ద‌క్షిణ ధ్రువాలుగా ఉండటం.. ద‌శాబ్దాలుగా సాగుతున్న వైరాన్ని ప‌క్క‌న పెట్టేయం.. ఆత్మీయంగా ప‌లుక‌రించుకోవ‌టం లాంటివి మ‌రే రెండు దేశాల మ‌ధ్య సాధ్య‌మేమో కానీ.. ఉత్త‌ర‌.. ద‌క్షిణ కొరియా దేశాల మ‌ధ్య సాధ్యం కాద‌నే మాట బ‌లంగా వినిపిస్తుంటుంది. అయితే.. అలాంటి అంచ‌నాలు త‌ప్ప‌ని తాజాగా తేలిపోయింది. ఈ  రెండు దేశాల మ‌ధ్య‌నున్న వైరాన్ని ప‌క్క‌న పెట్టి.. ఇరుదేశాల అధ్య‌క్షులు ఒక‌రికొక‌రు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వైనం ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిక‌రంగా చూస్తోంది.

ఆ మ‌ధ్య వ‌ర‌కూ ఒక‌రి గురించి మ‌రొక‌రు మాట్లాడుకోవ‌టానికి.. క‌నీసం ముఖ ముఖాలు చూసుకోవ‌టానికి సైతం ఇష్ట‌ప‌డ‌ని దేశాధినేత‌లు న‌వ్వులు చిందిస్తూ.. ఆత్మీయంగా ప‌లుక‌రించుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ముందుగా చేసుకున్న షెడ్యూల్ లో భాగంగా ఉత్త‌ర‌.. ద‌క్షిణ దేశాధినేత‌లు ఈ రోజు క‌లుసుకున్నారు. ఇరు దేశాల మ‌ధ్య‌నున్న శాంతి గ్రామం పాన్ మున్ జోమ్ ఈ విశేష భేటీకి వేదికైంది.

ద‌శాబ్దాల క్రితం (1953-54) ఉత్త‌ర‌.. ద‌క్షిణ కొరియాల మ‌ధ్య యుద్దం స్టార్ట్ కావ‌టం.. ముగియ‌కుండానే అలా ఉండిపోవ‌టం.. ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ రెండు దేశాధినేత‌లు ఎవ‌రూ క‌లుసుకోలేదు. అందుకు భిన్నంగా ఒక ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు ద‌క్షిణ కొరియాలో అడుగుపెట్ట‌టం ఇదే తొలిసారి.  వీరి భేటీకి ముందు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇరుదేశాల అధినేత‌లు త‌మ త‌మ దేశాల స‌రిహ‌ద్దుల్లో నిలుచున్నారు. ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు మూన్ ను త‌మ దేశంలోకి రావాలంటూ కిమ్ ఆహ్వానించారు.  ఇరువురు తొలుత శాంతి గ్రామ‌మైన పాన్ మున్ జోమ్ లో క‌లిసి ఒక‌రికొక‌రు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు నేత‌ల ముఖాల్లో న‌వ్వు వెల్లివిరిసింది. అనంత‌రం.. మూన్ తో క‌లిసి కిమ్ ద‌క్షిణ కొరియాలో అడుగుపెట్టారు.

దీంతో.. ద‌శాబ్దాల నాటి వైరం ఒక కొలిక్కి రావ‌ట‌మే కాదు.. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త తాత్కాలికంగా చెక్ ప‌డిన‌ట్లైంది. ఇక‌.. త‌మ చారిత్ర‌క భేటీకి గుర్తుగా ఇరువురు దేశాధ్య‌క్షులు క‌లిసి ఒక మొక్క‌ను నాటారు. అనంత‌రం వారిద్ద‌రూ స‌మావేశ‌మ‌య్యారు. రెండు దేశాల మ‌ధ్య‌నున్న స‌మ‌స్య‌ల‌పైనా ఇరువురు దేశాధ్య‌క్షులు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని భావిస్తున్నారు. త్వ‌ర‌లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కిమ్ స‌మావేశం అవుతార‌ని చెబుతున్న వేళ‌.. తాజా భేటీ ఆస‌క్తిక‌రంగా మారింది.