గ‌వ‌ర్న‌ర్‌పై సంచ‌ల‌న కామెంట్లు చేసిన చంద్ర‌బాబు

గ‌వ‌ర్న‌ర్‌పై సంచ‌ల‌న కామెంట్లు చేసిన చంద్ర‌బాబు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని ఆయన అన్నారు. గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. నిన్ననే విజయవాడలో నరసింహన్, చంద్రబాబులు కలసిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయన బాబు తీరును మార్చుకోవాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఈరోజు గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీకి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా విమర్శలు చేయలేదని కేవలం సమస్యలపైనే తాను పోరాడానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎన్ని విధాల ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తుందని చంద్ర‌బాబు వివరించారు. ఏపీ పట్ల కేంద్ర‌ వివక్ష చూపుతుందని ఆయన పున‌రుద్ఘాటించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని అయన మండిపడ్డారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఆంధ్ర ప్రజలకు మోడీ ద్రోహం చేశారని విమర్శించారు. టిడిపి చేస్తున్న ఆందోళనకు కేంద్రం దిగి రాకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ తీరును సైతం సీఎం చంద్ర‌బాబు త‌ప్పుప‌ట్టారు. అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని... ఆ అంశంపై పోరాటం కూడా చేశామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాల్సిన వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ అని... వార్తాపత్రికల్లో వచ్చేలా గవర్నర్ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేయాల‌ని గ‌తంలో ఇందిరాగాంధీ ప్ర‌య‌త్నిస్తే..ప్ర‌జ‌లు త‌గు రీతిలో బుద్ధి చెప్పార‌ని రాబోయే కాలంలో కూడా అదే జ‌రుగుతుంద‌ని బాబు స్ప‌ష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు