కాంగ్రెస్‌లో రేవంత్ బ్యాడ్ టైం కంటిన్యూ అవుతోందిగా?

కాంగ్రెస్‌లో రేవంత్ బ్యాడ్ టైం కంటిన్యూ అవుతోందిగా?

తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న‌ప్ప‌టికీ...తన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మ‌రింత దీటుగా ఎదుర్కోవాల‌నే ఉద్దేశంతో...ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో చేరిన కొడంగ‌ల్ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హ‌స్తం పార్టీ షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ముందుగా హామీ ఇచ్చిన ప్ర‌చార క‌మిటీ అనే ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌ని కాంగ్రెస్‌...తాజాగా ఆయ‌న పాద‌యాత్ర‌కు కూడా బ్రేకులు వేసిందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అదిష్టానం అందుకు నో చెప్పింది. వ్యక్తిగత పాదయాత్రలు వద్దని అధినేత రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో షాక్ తిన‌డం రేవంత్ వంతు అయింది.

పార్టీ బ‌లోపేతం, వ్య‌క్తిగ‌త చ‌రిష్మా పెంచుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పలువురు కొద్ది రోజులుగా ప్రణాళికలు రచించుకున్నారు. ఎమ్మెల్యే డీకే అరుణ జూన్‌ 8 తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆదిలాబాద్‌ వరకు మొత్తం 119 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధిష్ఠానం అనుమతిస్తే పాదయాత్రకు సిద్ధమని చాలాసార్లు ప్రకటించారు. రేవంత్‌రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాచైతన్య బస్సు యాత్ర ప్రారంభించారు. దీంతో నేత‌ల మ‌ధ్య ఉన్న పొరాపొచ్చాల‌ను పార్టీ పెద్ద‌లు గ్ర‌హించారు. అందుకే సున్నితంగా బస్సు యాత్ర జరుగుతుండగా పాదయాత్రలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వీరంతా ప్రయత్నాలు వాయిదా వేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఈ ముగ్గురు నేత‌ల‌కు షాక్ త‌గిలినంత ప‌న‌యింద‌ని అంటున్నారు.

కాగా, అధిష్టానం ఆర్డ‌ర్‌ను రేవంత్ కూల్‌గా తీసుకొని త‌న‌దైన శైలిలో క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. నేను పాదయాత్ర చేస్తానని ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌ను అడగలేదని, అడగని దాన్ని అధిష్టానం అనుమతి ఇవ్వలేదని వార్తలు రాయడం సరికాదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయాలనుకున్న మాట వాస్తవమ‌ని అయితే కాంగ్రెస్ లోకి వచ్చాక పాదయాత్ర చేస్తానని ఎప్పుడు చెప్పలేద‌ని రేవంత్ వివ‌రించారు. `పాదయాత్రపై నేను అడిగింది లేదు .. అధిష్టానం వద్దన్నది లేదు. నా నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటానని మాత్రమే పీసీసీకి చెప్పాను. పార్టీ ఆదేశించింది కాబట్టే బస్సుయాత్రలో ప్రతి చోట పాల్గొంటున్నాను. పార్టీ అధిష్టానం,పీసీసీ చీఫ్ ఆదేశిస్తే ఏపని అప్పజెప్పినా చేసేందుకు నేను సిద్ధం` అంటూ రేవంత్ వివాదానికి ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు