జ‌నం ఖాతాలో రూ.15ల‌క్ష‌ల మోడీ హామీపై జ‌వాబు ఇదే!

జ‌నం ఖాతాలో రూ.15ల‌క్ష‌ల మోడీ హామీపై జ‌వాబు ఇదే!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాటి బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీ నోటి నుంచి ఒక మాట అదే ప‌నిగా వ‌చ్చేది. తాము కానీ అధికారంలోకి వ‌స్తే.. దేశంలో ప్ర‌తి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15ల‌క్ష‌ల మొత్తాన్ని వేస్తామ‌ని చెప్పేవారు. అదెలానంటే.. విదేశాల‌కు మ‌ళ్లిన న‌ల్ల‌ధ‌నాన్ని ముక్కుపిండి వ‌సూలు చేసి.. దేశ ప్ర‌జ‌ల‌కు తిరిగి ఇస్తామ‌ని బీరాలు పలికారు.

ఇలాంటివి సాధ్యం కానివే అయిన‌ప్ప‌టికీ.. దేశం దాటిన న‌ల్ల‌ధ‌నం గురించి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న నేత నోటి రావ‌టంతో దేశ ప్ర‌జ‌లంతా ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకున్నారు. మోడీ మాట‌లు ఆచ‌ర‌ణ సాధ్యం కావ‌ని తెలిసినా.. ప‌లువురు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించారు. త‌మ నేత మోడీ ప్ర‌ధాని అయితే చూడండి.. అద్భుతం ఆవిష్కృత‌మ‌వుతుంద‌ని చెప్పేశారు.
ప్ర‌ధాని కుర్చీలో మోడీ కూర్చొని నాలుగేళ్లు పూర్తి అయిపోయాయి. మ‌రో ఆర్నెల్లు గ‌డిస్తే సార్వ‌త్రిక వేడి దేశాన్ని క‌మ్మేసే ప‌రిస్థితి. మ‌రో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రికొద్ది నెల‌ల్లో సిద్ధ‌మ‌వుతున్న వేళ‌న కూడా మోడీ వేస్తాన‌ని చెప్పిన రూ.15ల‌క్ష‌ల ఆచూకీ లేకుండా పోయింది. మోడీ హామీపై స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త ఒక‌రు పీఎంవోను ప్ర‌శ్నించారు.  ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి పౌరుడి ఖాతాలో రూ.15ల‌క్ష‌ల మొత్తాన్ని జ‌మ చేస్తామ‌ని మోడీ చెప్పార‌ని.. దాని సంగ‌తి ఏమిటి? అంటూ ప్ర‌శ్నించారు.

దేశ ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాలో రూ.15లక్ష‌ల మొత్తాన్ని జ‌మ చేసే డేట్ చెప్పాల్సిందిగా ఆయ‌న కోరారు. 2016 న‌వంబ‌రు 26న సంధించిన ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం తాజాగా రియాక్ట్ అయ్యింది. ఆర్టీఐ రూల్స్ ప్ర‌కారం ఇది అస‌లు ప్ర‌శ్నే కాద‌ని తేల్చి చెప్పింది.  ప్ర‌శ్నే కాన‌ప్పుడు స‌మాధానం చెప్పేందుకు కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే పీఎంవో నుంచి వ‌చ్చిన స‌మాధానంపై ఆర్టీఐ కార్య‌క‌ర్త మోహ‌న్ కుమార్ శ‌ర్మ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. తాను అడిగిన ప్ర‌శ్న‌కు పీఎంవో నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ పూర్తి స‌మాచారం రాలేద‌ని చెబుతున్నారు. నాడు మోడీ ఇచ్చిన హామీ ప్ర‌తిప‌క్షాల‌పై బ్ర‌హ్మాస్త్రంగా మారింద‌ని గుర్తు చేస్తున్నారు. మ‌రి.. ఎన్నిక‌ల వేళ‌.. మ‌ళ్లీ తెర మీద‌కు వ‌చ్చిన రూ.15ల‌క్ష‌ల మొత్తం ముచ్చ‌ట రానున్న రోజుల్లో రాజ‌కీయాల్ని ఎంత‌లా ప్ర‌భావితం చేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు