హ‌రీశ్ ఓ మూల‌కు...కేటీఆర్‌దే మొత్తం హ‌వా

హ‌రీశ్ ఓ మూల‌కు...కేటీఆర్‌దే మొత్తం హ‌వా

తెలంగాణ‌లో అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ఎస్ పార్టీలో మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీ అన‌గానే తెలంగాణ‌వాదాన్ని ఎత్తుకొని విజ‌య‌వంతంగా రాష్ట్రం కోసం పోడాని పార్టీ అనే గుర్తింపును పొందిన‌ట్లే... పార్టీలో వార‌స‌త్వ పోరు జ‌రుగుతోంద‌నే చ‌ర్చ కూడా వినిపిస్తుంది. ప్ర‌ధానంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్‌కు, ఆయ‌న మేన‌ల్లుడైన మంత్రి హ‌రీశ్ రావుకు మ‌ధ్య పోరు జ‌రుగుతుంద‌నే టాక్ ఉంది. తాజాగా మ‌రోమారు విజ‌య‌వంతంగా హ‌రీశ్‌ను ప‌క్క‌న‌పెట్టార‌ని టాక్ వ‌స్తోంది. ఈ నెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీ నేప‌థ్యంలో ఈ చ‌ర్చ మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది.

గ‌తంలో పార్టీ కార్య‌క్ర‌మాల విష‌యాల్లో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించిన హ‌రీశ్‌ ఇటీవ‌ల దానికి భిన్నంగా త‌న ప‌నేదో తాను చేసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ ప‌రంగా మంత్రి కేటీఆర్‌కు అగ్ర‌తాంబూలం ద‌క్క‌డం, ఆయ‌న్నే ప్రొజెక్ట్ చేయాల‌ని అడుగులు ప‌డుతున్న నేప‌థ్యంలో హ‌రీశ్ కామ్ అయిపోయారు. దీన్ని నిజం చేస్తూ తాజాగా మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. కొంపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ ఇవాళ‌ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ నిర్వహణ కోసం 9 కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. ప్లీనరీకి వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన రాష్ట్ర వంటకాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని.. ప్లీనరీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

మ‌రోవైపు పార్టీకి అత్యంత ప్ర‌ధాన‌మైన కార్య‌క్ర‌మానికి హ‌రీశ్ దూరంగా ఉన్నారు. సంగారెడ్డిలో జ‌రిగిన పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను  మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీలన్నీ బీజేపీ కి అనుకూలమన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదని ఆయన అన్నారు. కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. మోడీని దించడానికో రాహుల్ ను ఎక్కించడానికో టీఆర్ఎస్ పార్టీ పనిచేయదన్నారు. టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇండస్ట్రియల్,ఐటీ సెక్టార్ లో సబ్సిడీ, టాక్స్ మినహాయింపులను ఇవ్వాల్సి ఉండగా వీటి పై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడరని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతు బంధు పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు 750 కోట్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు