సీమ ర‌చ్చ‌పై మూడో క‌న్ను తెరువు బాబు

సీమ ర‌చ్చ‌పై మూడో క‌న్ను తెరువు బాబు

తెలుగుదేశం పార్టీ శ్రేణులు త‌మ నాయ‌కుడు, ఏపీ ముఖ్య‌మంత్రి అయిన నారా చంద్ర‌బాబు నాయుడు ఉగ్ర‌రూపం దాల్చ‌ల‌ని కోరుకుంటున్నాయి. క‌న్నెర్ర చేస్తేనే..ప‌రిస్థితులు సెట్ అవుతాయ‌ని ఆకాంక్షిస్తున్నాయి. అదేంటి స్వ‌యంగా పార్టీ నేత‌లు ఎందుకు బాబును ఇలాంటి కోరిక కోరుతున్నాయంటే...పార్టీ ప‌రువు గంగ‌పాలు అవుతున్నందుకు. సాక్షాత్తు చంద్ర‌బాబే స్వ‌యంగా జోక్యం చేసుకొని సామ‌ర‌స్యంగా స‌ర్దిచెప్పినా...మ‌ళ్లీ త‌మ పంతాల‌కు పోయి పార్టీని ప‌లుచ‌న చేస్తున్నందుకు. ఇదంతా క‌ర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియ‌ర్ నేత‌ ఏవీ సుబ్బారెడ్డి మధ్య జ‌రుగుతున్న ర‌చ్చ గురించి.

పార్టీలో కీల‌క నేత‌లైన అఖిలప్రియ, సుబ్బారెడ్డి పోటాపోటీ సైకిల్ యాత్రలు చేస్తున్నారు. రుద్రవరం మండలం ముత్తలూరు, నర్సాపురంలో అఖిలప్రియ, ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌యాత్ర చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆదివారం సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో భారీగా పోలీసులను మోహరించారు. నిన్న ఘటనపై ఆళ్లగడ్డ డీఎస్పీకి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆహోబిలానికి చెందిన సంజీవరాయుడు, చింతకుంటకు చెందిన రాముతో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య విబేధాలు ఇదే మొద‌టిసారి కాద‌ని అంటున్నారు. గ‌త కొద్దికాలం క్రితం మంత్రి అఖిల‌ప్రియ‌, సుబ్బారెడ్డి మ‌ధ్య కొద్దికాలం క్రితం తీవ్ర విబేధాలు త‌లెత్తాయి. దీంతో ఇటీవల చంద్రబాబు సింగపూర్ పర్యటన వెళ్లే ముందు వీళ్లిద్దరితో సమావేశమై ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇద్దరు సంయమనం పాటించాలని ఆదేశించారు.

పార్టీ అధినేత చ‌ర్చించిన అనంత‌రం  కర్నూలు జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఈ ఇద్ద‌రితో సమావేశమై ఇరువురికి సర్ధిచెప్పారు. సమావేశమనంతరం ఇద్దరం కలిసి సంయమనంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అయితే ఆదివారం సుబ్బారెడ్డిపై జరిగిన రాళ్ల దాడితో పరిస్థితి మొదటికి వచ్చింది. మళ్లీ వీరి మధ్య విభేదాలు రావడం.. వీరి అనుచరులు బహాబాహికి దిగడం ఇప్పుడు కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశమైంది. దీంతో బాబు ఈ ఇద్ద‌రినీ క‌ల‌వాల‌ని కోరారు. మంగ‌ళ‌వారం ఈ భేటీలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయాల‌ని అంటున్నారు. మ‌రోవైపు తనపై దాడి జరిగిన పార్టీ శ్రేయస్సు కోసం సర్దుకుపోతామని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఆదివారం జరిగిన దాడి ఘటనను అఖిలప్రియ ఖండించారు. ఎవరిపైనా దాడి చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.