క‌ళ్యాణ‌దుర్గం లో తిరిగి పట్టు సాధిస్తున్న టీడీపీ

అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఇక్క‌డ టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. 2014లో విజ‌యం ద‌క్కించుకున్న ఉన్నం హ‌నుమంత‌రాయ చౌద‌రిని ప‌క్క‌న పెట్టి గ‌త 2019 ఎన్నిక‌ల్లో మాదినేని ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడుకు చంద్ర‌బాబు అవ‌కాశం ఇచ్చారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ ట‌ఫ్‌గా ఉండ‌డం వైసీపీ దూకుడు, జ‌గ‌న్ హ‌వా నేప‌థ్యంలో ఇక్క‌డ టీడీపీ ఓడిపోయింది. అయితే.. గ‌డిచిన రెండేళ్ల‌లో.. ఇక్క‌డ టీడీపీ రాజ‌కీయం కీల‌క మ‌లుపు తిరిగింది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసిన‌.. ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు.. క‌నిపించ‌క‌పోగా.. ఆయ‌న ఊసు కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు.

దీంతో మ‌ళ్లీ ఉన్నం పుంజుకున్నారు. అంతేకాదు.. ఈ ద‌ఫా.. ఆయ‌న త‌న ఇద్ద‌రు త‌న‌యుల‌ను కూడా టీడీపీలో చేర్పించి.. రాజ‌కీయంగా యూత్‌ను త‌న‌ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఉన్నం తనయులు మారుతి చౌదరి, ఉదయ్‌చౌదరిలు.. కూడా యూత్ ఫాలోయింగ్‌లో ముందున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలా వుంటే.. స్థానికంగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌.. వైఖ‌రితో టీడీపీ మ‌రింత పుంజుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. ఆమె.. బెంగ‌ళూరుకే ప‌రిమితం కావ‌డం.. కేవ‌లం స‌భ‌లు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌డం పెద్ద ఎత్తున ఆమెపై వ్య‌తిరేక‌త పెరిగేలా చేసింది. దీనికితోడు.. స్థానిక‌ ఎంపీతో ఆమెకు ఉన్న వివాదాలతో నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఇదే అదునుగా.. ఉన్నం పుంజుకున్నారు. గ‌త అనుభ‌వాలు, పార్టీలో సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని ఆయ‌న రాజ‌కీయాలు సాగించేందుకు.. ఉత్సాహంగా క‌దులుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న త‌న జ‌న్మ‌దిన వేడుక నిర్వ‌హించారు. అయితే.. పైకి పుట్టిన రోజు ఫంక్ష‌నే అయిన‌ప్ప‌టికీ.. త‌న రాజ‌కీయ బ‌లాన్ని నిరూపించే వ్యూహాన్ని ఉన్నం అమ‌లు చేశారనే టాక్ వినిపించింది. ఈ కార్య‌క్ర‌మానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అంతేకాదు.. 30 మంది వ‌ర‌కు వైసీపీ నుంచి వ‌చ్చి.. పార్టీలో చేర‌డం.. ఉన్నం కుమారుల‌కు జై కొట్ట‌డం.. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

దీనికి టీడీపీ పై ఉన్న సానుభూతితో పాటు.. స్థానికంగా ఎమ్మెల్యే నిర్ల‌క్ష్యం.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డం వంటి ప‌రిణా మాలు కార‌ణంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఉష‌శ్రీ చ‌ర‌ణ్ ఇలానే ఉంటే.. ఖ‌చ్చితంగా టీడీపీ భారీ మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు పరిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల కాలంలో మారుతున్న ప‌రిణామాలు కూడా టీడీపీకి ప్ల‌స్‌గా మారుతున్నాయ‌ని.. ఉన్నం కుమారులు స‌హా హ‌నుమంత‌రాయ చౌద‌రి దూకుడు వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ప‌రిశీల‌కులు సైతం అంటున్నారు. మ‌రి నిజంగానే మార్పు వ‌స్తుందో.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందో.. లేదో.. చూడాలి.