బాల‌య్య‌పై కేసులో సాక్షిగా బాబు..పోలీస్ సెక్యురిటీ

బాల‌య్య‌పై కేసులో సాక్షిగా బాబు..పోలీస్ సెక్యురిటీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బావ‌మ‌రిది నంద‌మూరి బాల‌కృష్ణ‌ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ర‌చ్చ ఇంకా త‌గ్గ‌లేదు. బీజేపీ నేత‌లు బాల‌య్య టార్గెట్‌గా విమ‌ర్శ‌లు కొన‌సాగించ‌డంతో పాటుగా కేసులు న‌మోదు చేస్తున్న ఉదంతం కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో ప‌లుచోట్ల నేత‌లు బాల‌య్య దిష్టిబొమ్మ‌లు ద‌గ్దం చేశారు. ఆయ‌న్ను అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ లోని బాలకృష్ణ నివాసం వద్ద దాదాపు వంద మంది పోలీసులతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు బాలకృష్ణ ఇంటిని ముట్టడించే అవకాశం పోలీస్ శాఖ వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మ‌రోవైపు, ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు,  ప్రధానిపై ప్రయోగించిన భాష విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 2019లో ఏం జరుగుతుందనే విషయం చంద్రబాబు కళ్లముందు కనిపిస్తోందన్నారు. 2004లో ఏం జరిగిందో 2019లో అదే జరగబోతోందని సోము వీర్రాజు అన్నారు. బాలయ్య మాట్లాడుతుంటే చంద్రబాబు నవ్వుతున్నారని బాలకృష్ణపై కేసు పెట్టి… సీఎం చంద్రబాబును సాక్షిగా పెట్టాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో బాలయ్య దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు బీజేపీ శ్రేణులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు